జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ లక్ష్యంగా త్రిశూల్ కమిటీ: సీఎం
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:27 PM
జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ ఉమెన్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా కమిటీ వేసి కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ ఉమెన్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా కమిటీ వేసి ఓ కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈరోజు (శుక్రవారం) కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో శాంతిభద్రతలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. త్రిశూల్ పేరిట ఈ మూడు అంశాలపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, అభ్యంతరకరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యవస్థీకృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులపై మరింత దృష్టి పెట్టాలని మార్గనిర్దేశం చేశారు. కానిస్టేబుళ్లలో టెక్నాలజీపై అవగాహన ఉన్న వారిని 30 మందిని జిల్లాలకు కేటాయించామని వెల్లడించారు.
సీఐడీలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి..
సైబర్ టెక్నాలజీలో నిఫుణులను సీఐడీలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి సహా డ్రగ్స్ లాంటి నేరాల నియంత్రణపై క్యాలెండర్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో డీఅడిక్షన్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు సేఫ్టీ, ప్రమాదాలు సహా వివిధ ప్రధాన నేరాలపై జిల్లాల వారీగా వివిధ శాఖల సమన్వయంతో సమీక్షించాలని ఆదేశించారు. ప్రతీ ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని సూచించారు. ఆయా కారణాలను వెలికి తీయాలని.. అంబులెన్స్‌లు ఎంత సమయానికి చేరుకుంటునన్నాయని అడిగారు. ఆయా ప్రమాదాలకు కారణాలేమిటన్నది విశ్లేషించాలని.. రోడ్డు ప్రమాదాల విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గడిచిన రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
నేరాల కట్టడిపై దృష్టి పెట్టాలి..
ప్రతీ జిల్లాలో 30 మంది పోలీసులతో జిల్లా యాక్షన్ అండ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను డీజీపీ కార్యాలయంలో నియమించామని వెల్లడించారు. నేరాల కట్టడిపై దృష్టి పెడితే ఫలితాలు కనిపిస్తున్నాయని.. ఆర్థిక నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆర్థికనేరాలు ఎందుకు పెరిగాయో విశ్లేషించుకోవాలని సూచించారు. 29.2 శాతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరాలు తగ్గాయని చెప్పారు. శాస్త్రీయంగా చేస్తున్న దర్యాప్తు విషయంలో రెండేళ్లలో 3 శాతం వృద్ధి కనిపించిందన్నారు. క్రిటికల్ కేసుల్లో డీఎన్ఏ పరీక్షల ఫలితాలకు పట్టే 6 గంటల సమయం మరింత తగ్గాలని తెలిపారు. నేరాలు జరిగిన ప్రాంతానికి 30 నిమిషాల్లోపే చేరుకోవాలని సూచించారు. నేరం జరిగే ప్రాంతానికి ఎంత త్వరగా వెళ్తే అంత ఫలితం ఉంటుందన్నది గుర్తించాలని అన్నారు. కన్వెక్షన్ రేట్ 47 శాతంగా ఉందని.. ఆధారాలను సేకరిస్తే... కన్విక్షన్ రేట్ మరింత పెరుగుతుందని వెల్లడించారు. కోర్టు కేసులను పరిష్కరించేందుకు ‘వన్ కోర్టు- వన్ కానిస్టేబుల్’ అనే విధానం ఉండాలని సూచించారు. ప్రాంతీయంగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని.. డాగ్ స్క్వాడ్‌లను కూడా నియమించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏపీలో స్థిరంగా శాంతిభద్రతలు..
ఏపీలో స్థిరంగా శాంతిభద్రతలు ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్స్ కేసులు 19.7శాతం తగ్గుముఖం పట్టాయని వివరించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, కడప, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 40.3శాతానికి కేసులు తగ్గాయని వెల్లడించారు. ఏలూరు, ఎన్టీఆర్, అనంతపూర్ జిల్లాల్లో 60 శాతం పెరిగాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దాడి, నేరాల కేసులు 29.5శాతం తగ్గాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాల నమోదులో 11.7శాతం తగ్గాయని అన్నారు. అల్లర్ల కేసుల్లో 28.2శాతం గణనీయంగా తగ్గాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన నేరాలు 12.7శాతం తగ్గాయని వివరించారు.
ఆ జిల్లాల్లో సైబర్ నేరాలు పెరిగాయి..
ప్రకాశం, నెల్లూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో 12.6శాతం సైబర్ నేరాలు పెరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో సైబర్ నేరాల ఫిర్యాదులు 10శాతం తగ్గాయని చెప్పుకొచ్చారు. మహిళలపై నేరాలు 12.5శాతం తగ్గాయన్నారు. కృష్ణా జిల్లాలో 36శాతం తగ్గుదలతో అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 2024-25లో 16,973 కేసులు.. 2025-26లో 14,849 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ ఏడాదిలో 2,124 కేసులు తగ్గాయని చెప్పారు. 28 జిల్లాల్లో 21 జిల్లాల్లో మహిళలపై నేరాలు తగ్గాయని అన్నారు. సత్యసాయి జిల్లాలో 32.8శాతం నేరాలు తగ్గాయని తెలిపారు. విశాఖపట్నంలో 25.3శాతం.. నంద్యాలలో 25.2శాతం తగ్గాయన్నారు. ప్రకాశం జిల్లాలో 21.5శాతం.. చిత్తూరు, గుంటూరులో 20.7శాతం తగ్గాయని చెప్పారు. నెల్లూరులో ‘సురక్షిత మహిళా’ కార్యక్రమం చొరవతో 19.5శాతం తగ్గాయని వెల్లడించారు. ప్రకాశం, మార్కాపురంలో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News