తెలుగు నేర్పించే ‘Coolphabets’ యాప్ విడుదల.. సీఎం అభినందనలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:36 AM
’దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష... మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ’దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష... మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. తెలుగు వైభవం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ తరంలో కూడా మన పిల్లలకు తెలుగు చదవడం, తెలుగు అక్షరాలు రాయడం అలవాటు కావాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచితేనే మన తెలుగు లిపి భావితరాల్లో వెలుగుతుందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగుతో భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే ‘Coolphabets’ యాప్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా యాప్ విడుదల చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఏఐ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి, అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా ఈ యాప్‌ను రూపొందించడం సంతోషకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సాంకేతికత మన భాషకు దూరం చేయకూడదని.. మరింత చేరువ చేయాలని సూచించారు. మన భాష, మన లిపి, మన సంస్కృతికి చిరునామా.. మన తెలుగు జాతికి గుర్తింపు అని తెలిపారు. తేనెలొలుకు తెలుగు.. భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News