ఎల్‌నినోపై కేబినెట్ అప్రమత్తం.. అమరావతికి పెద్దపీట
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:21 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన పలు ముఖ్య ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన పలు ముఖ్య ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ఆ వివరాలను వెల్లడించారు. అన్నదాతలకు ఆర్థిక చేయూతతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తోతాపురి మామిడికి మద్దతు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.281 కోట్ల నిధులు సమకూర్చుకునే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ-2026 ముసాయిదాకు కూడా ఆమోదం లభించింది.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులకు అనుమతి లభించింది. ఇందుకోసం రూ.6.24 కోట్ల మేర పనులు చేపట్టనున్నారు. వెలిగొండ టన్నెల్-2లో టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) తొలగింపు పనులకు రూ.11.63 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు అమరావతిలో రహదారి నిర్మాణ విధానంలో మార్పులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సిమెంట్ కాంక్రీట్ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్‌ఆర్‌ఐ, చీఫ్ ఇంజినీర్ల బోర్డు సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.శాఖమూరులో 'అమరావతి సంగమం' నిర్మాణానికి రూ.759.79 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గుడ్ గవర్నెన్స్ సంస్థలు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూ సమీకరణకు సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది. మార్కాపురంలో సమీకృత కలెక్టరేట్ సముదాయం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
ఎల్‌నినో ప్రభావంపై..
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 శాతం వర్షపాత లోటు ఉందని, దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్‌నినో ప్రభావాన్ని రైతులకు వివరించాలని ఆదేశించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, వాటికి 90 వేల కిలోల విత్తనాలు అందించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎల్‌నినో పరిస్థితుల్లో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అవసరమైన చోట బోర్లు వేయడం సహా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ లేఖలు రాయాలని, వెదర్ బేస్‌డ్ ఇన్సూరెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు వీబీ జీ రామ్ జీ నిధులను వినియోగించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ రంగానికీ భరోసా..
కడప జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సీలేరు కాంప్లెక్స్‌లో ఏపీజెన్‌కోకు ఫైర్ ప్రికాషనరీ ఫీజు మినహాయింపుపై ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ ట్రాన్స్‌కో మధ్యకాలిక రుణానికి రూ.950 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులో సామర్థ్యాల మార్పిడికి అనుమతి ఇచ్చింది. ఏపీపీసీఎల్ రుణాలకు కార్పొరేట్ గ్యారంటీలు ఇచ్చేలా ఏపీజెన్‌కోకూ అనుమతి కల్పించింది.
ఇక.. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి రూ.25 వేల కోట్ల నిధులు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద చేపట్టే పనులకు రెండేళ్ల డిఫెక్ట్ లాయబిలిటీ పీరియడ్ ఉండేలా, అనంతరం పదేళ్లపాటు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ వంటి ప్రాజెక్టులు విపత్తుల సమయంలో కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి పనులను ప్రాంతీయ, కుల విభేదాలకు దారితీసేలా రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించింది.
అమరావతిలో ఎన్‌ఐటీ, ఐఐటీకి సంబంధించిన యూనిట్ల ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. మూడు ప్రాంతాల్లో యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకటి తిరుపతిలో, రెండోది అమరావతిలో, మూడోది విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని
సోషల్ మీడియాలో జెన్ జీ క్రియాశీలకం..అందుకు తగ్గట్టుగా సిద్ధమవ్వాలి: సీఎం చంద్రబాబు