బీసీల రక్షణ కోసం త్వరలో కొత్త చట్టం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:03 PM
బీసీలకు రక్షణ కల్పించేందుకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్లు భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 13: బీసీలకు రక్షణ కల్పించేందుకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్లు భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీల రాజకీయ, ఆర్థిక, విద్య సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఆనాడు అన్న ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. వాటిని నేడు సీఎం చంద్రబాబు నాయుడు 34 శాతానికి పెంచారని వివరించారు.
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 40 శాతానికిపైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తుందని వివరించారు. వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారని మండిపడ్డారు. దీంతో 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించిందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే రూ.12,500 కోట్ల ఆర్థిక సంఘం నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం కేటాయింపులు చేసినట్లు గుర్తు చేశారు. చేనేత కార్మికులకు నేతన్నల సేవలో.. పథకం ద్వారా ఏటా రూ.25 వేల సాయంతోపాటు వారి మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు జీవో నంబర్ 217 రద్దు చేశామని తెలిపారు. వారి సంక్షేమం కోసం మత్స్యకారుల సేవలో పథకాన్ని అందిస్తున్నామని వివరించారు. గత వైసీపీ పాలనలో బీసీ నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసు.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించిన ఏపీ సీఎం
హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
For More AP News And Telugu News