డ్రగ్స్ విక్రయాలను ప్రశ్నించిన యువకుడి దారుణ హత్య..
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:46 PM
మెడికల్ షాపుల్లో మత్తుపదార్థాల విక్రయాలను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ప్రశ్నించడం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఒక మెడికల్ షాపు యజమాని జరిపిన కాల్పుల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పర్వీందర్ సింగ్ జోటా మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ డ్రగ్స్, మత్తు పదార్థాల విక్రయాలపై ధైర్యంగా గళమెత్తిన ఓ యాక్టివిస్ట్‌ను మెడికల్ స్టోర్ యజమాని అతి దారుణంగా కాల్చి చంపాడు. మృతుడిని పర్విందర్ సింగ్ జోటాగా గుర్తించారు.
మెడికల్ షాపుల్లో అంతులేకుండా అమ్ముతున్న మత్తు పదార్థాల గుట్టు రట్టు చేయడంలో పర్విందర్ సింగ్ జోటా ముందుండేవారు. అలాగే మంగళవారం డ్రగ్స్ విక్రయాలపై మాన్సా జిల్లాలోని ఓ దుకాణదారుడిని ప్రశ్నించారు. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్ చేయడం ప్రారంభించారు. దాంతో యజమానికి, పర్వీందర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనతో పాటు ఒక వృద్ధుడిని ఉంచుకుని, ఆ దుకాణం నుంచే తాము మత్తు పదార్థాలు కొనుగోలు చేసినట్లు ఆయన వీడియోలో స్పష్టంగా చూపించారు. ఈ వ్యవహారంపై షాప్ యజమానికి, జోటాకు మధ్య వాగ్వాదం పెరిగింది.
ఆ సమయంలో మెడికల్ స్టోర్ యజమాని చేతిలో పిస్టల్ కనిపించింది. అతడు కాల్పులు జరపడంతో పర్వీందర్ నేలపై పడిపోయినట్లు ఆ దృశ్యాల్లో రికార్డైంది. కాల్పుల శబ్దం వచ్చిన వెంటనే జోటా మొబైల్ ఫోన్ కిందపడిపోవడంతో లైవ్ రికార్డింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టపగలు జరిగిన ఈ దారుణ హత్య పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. శాంతిభద్రతలు సరిగా లేవని ఆప్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి