Share News

అక్టోబరులోగా పురపోరు

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:36 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది.

అక్టోబరులోగా పురపోరు

  1. ఎస్సీ, ఎస్టీలకు నష్టం లేకుండా

  2. బీసీ వర్గానికి 34 శాతం కోటా

  3. పట్టణ స్థానికంలో 33.33 శాతం

  4. జిల్లా పరిషత్‌లు 28కు పెంపు

  5. జగన్‌ హయాంలో తెచ్చిన ఇద్దరు

  6. డిప్యూటీ మేయర్ల విధానానికి స్వస్తి

  7. వైసీపీ మద్యం బ్రాండ్స్‌ పేర్ల మార్పు

  8. మంత్రివర్గ భేటీలో నిర్ణయం

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది.


చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెట్‌ కమిషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి మండలికి అధికారులు వివరించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


కేసులు వెనక్కి..:

ఈ ఏడాది అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. సకాలంలో ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను భారీగా నష్టపోతామని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర నిధులు సుమారు రూ.28 వేల కోట్లను సద్వినియోగం చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అత్యవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాల్సిందేనన్నారు. అయితే, 23 మున్సిపాలిటీలకు సంబంధించి పంచాయతీల విలీనంపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని, అవసరమైతే ఆ కేసులను ఉపసంహరించుకుని లేదా విలీనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసైనా ఎన్నికలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పదవుల పందేరం కోసం తీసుకువచ్చిన ఇద్దరు డిప్యూటీ మేయర్ల విధానాన్ని రద్దు చేసి గతంలో ఉన్నట్టే ఒక మేయర్‌, ఒక డిప్యూటీ మేయర్‌ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.


మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు

  • కర్నూలు జిల్లా గుట్టపాడువద్ద ఎకరా రూ.10 లక్షల చొప్పున 143.26 ఎకరాల భూమి అగస్త్య ఎనర్జీ లిమిటెడ్‌కు కేటాయించారు. ఇక్కడ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో 12 గిగావాట్‌ సిలికాన్‌ ఇంగోట్‌ అండ్‌ పేపర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థకు ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం-2024-29 ప్రకారం ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నారు.

  • విశాఖపట్నం జిల్లా గాజువాక-పరవాడ పారిశ్రామిక పార్కువద్ద రూ.1600 కోట్ల పెట్టుబడితో 3.6 గిగావాట్‌ టీడీపీసీవోఎన్‌ సోలార్‌ సెల్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ ప్లాంటులో 750 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.

  • మెస్సర్‌ ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ టారి్‌ఫను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

  • శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద పాస్ఫరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ స్థాపనకు 450 ఎకరాలు కేటాయించేందుకు, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అల్యూమినియం ప్రాజెక్టు కోసం మెస్సర్స్‌ హిందాల్కోకు 60 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తంగా 57 పెట్టుబడుల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.


వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలి

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణపై మంత్రులు దృష్టి సారించాలని సీఎం సూచించారు. అదేసమయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో ‘త్రీ క్యాపిటల్స్‌’ వంటి పిచ్చి పిచ్చి పేర్లను మద్యం బ్రాండ్లుగా పెట్టి ప్రమోట్‌ చేశారని, అలాంటి పేర్లను తీసేయాలని సూచించారు. విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని, కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవడం, థర్మల్‌ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయాన్ని యూనిట్‌కు 23 పైసల వరకు ఆదా చేయగలిగామన్నారు. ఇది ఆ శాఖ పనితీరుకు నిదర్శమని.. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సీఎం ప్రశంసించారు.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 08:36 AM