Share News

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN , Publish Date - Jan 17 , 2026 | 10:28 AM

తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
Tuni Violence

కాకినాడ జిల్లా, జనవరి 17: జిల్లాలోని తుని ప్రాంతంలో వైసీపీ నేతలు(YCP Leaders) బరితెగించారు. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో కనుమ పండుగ రోజు ఘోరం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న టీడీపీ నేతలపై కొందరు వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేశారు. మాటువేసి మరీ కత్తులు, ఇనుప రాడ్లతో ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.


వైసీపీ నేతల దాడిలో లాలం బంగారయ్య(30) అనే టీడీపీ నేత తీవ్రమైన కత్తిపోట్లతో నేలకొరిగాడు. వెంటనే ఆయన్ను తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందాడు. గాయపడిన ఇద్దరు టీడీపీ నేతలు ప్రస్తుతం.. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఇదీ జరిగింది..

శుక్రవారం రాత్రి ఓ టీడీపీ నేత పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తుండగా.. సుమారు 20 మంది మంది కలిసి కత్తులు, ఇనుప రాడ్లతో వారిపై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఘటన తర్వాత గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీపీ నేతలపై దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలపై దాడి ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.


నచ్చజెప్పేందుకు వెళ్లిన పాపానికి..

మరోవైపు.. తొండంగి మండలం ఏ.కొత్తపల్లి తూర్పు వీధిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. గుండాట డబ్బుల పంపకాల్లో వైసీపీలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణ తీవ్రస్థాయి చేరడంతో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే తిరిగి దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. వీరిని ఒక వర్గంగా భావించి బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన కొంజర్ల గోవిందు, నామాల గోపికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..

ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 11:34 AM