వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:00 AM
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లా, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వేట్లపాలెం గ్రామ శివార్లలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
యజమానులపై పోలీసుల దృష్టి..
ఈ దుర్ఘటనలో ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ తండ్రి అడబాల శ్రీను కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసుల ముందు లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తీవ్ర విషాదం..
ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా.. లేదా?, భద్రతా ప్రమాణాలు పాటించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి భారీ ప్రాణనష్టం జరగడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే సామర్లకోట, కాకినాడ ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపు చేశాయి. మధ్యాహ్నం భోజన విరామం కావడంతో సగం మంది కార్మికులు బయటకు వెళ్లడం వల్ల ప్రాణనష్టం కొంత మేర తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. లేదంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
పంచనామా, పోస్టుమార్టం పూర్తి..
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పంచనామా, పోస్టుమార్టాన్ని అధికారులు నిర్వహించారు. నిన్న(శనివారం) అర్ధరాత్రి నుంచి ఇవాళ(ఆదివారం) ఉదయం 6 గంటల వరకు 11 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒక్కక్కరికీ రూ.25 వేల సహాయం అందజేయనున్నారు. ఈరోజు మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు వంగలపూడి అనిత, పొంగూరి నారాయణ, కందుల దుర్గేశ్ పరిహారం చెక్కులు అందించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News