టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:06 PM
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ, జనవరి21 (ఆంధ్రజ్యోతి): కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో(Bangarayya Case) ఏపీ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు కారణాలివే..
పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ నెల 16న రాత్రి నిందితులు ముందస్తు పథకం ప్రకారం మాటువేసి కత్తులు, రాడ్లతో టీడీపీ నేతలపై దాడికి తెగబడ్డారని తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బంగారయ్య.. ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు.
నిందితుల వివరాలివే..
అరెస్ట్ అయిన 12 మంది నిందితులు అధికారికంగా వైసీపీకి చెందిన నేతలుగా గుర్తించారు. ప్రధాన నిందితుడైన కోటనందూరు మండలం వైసీపీ మండల అధ్యక్షుడు చింతకాయల చినబాబు ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన 11 మంది కూడా స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులని పోలీసులు తెలిపారు.
తుని వీధుల్లో నడిపించుకుంటూ..
సాధారణంగా నిందితులను వాహనాల్లో తరలించే పోలీసులు.. ఈ కేసులో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. నిందితులందరినీ తుని పట్టణంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నడిపించారు. ప్రజలందరూ చూస్తుండగా నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేరగాళ్లలో భయం పుట్టించేందుకే పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..
టీడీపీ నేత బంగారయ్య హత్యతో అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులు వైసీపీకి చెందిన కీలక నేతలు కావడంతో రాజకీయంగానూ ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసులు.. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోర్టుకు నిందితులు..
అరెస్ట్ చేసిన 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నారు. హత్యకు వాడిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాజకీయ కక్షలు నిండు ప్రాణాలను బలితీసుకోవడం పట్ల సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ కేసు.. సుప్రీం కోర్టులో నిందితులకు ఎదురుదెబ్బ
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..
For More AP News And Telugu News