కాకినాడలో భారీ స్కాం.. అధిక లాభాల పేరుతో టోకరా
ABN , Publish Date - Jul 01 , 2026 | 08:20 AM
కాకినాడలో జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక లాభాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుంచి భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులు సేకరించింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ, జులై 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధిక లాభాల ఆశచూపి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (Genesis Capital Management) సంస్థ మాయాజాలం కాకినాడలో కలకలం రేపుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ రిటర్న్స్ ఇస్తామంటూ ఈ సంస్థ నమ్మించింది. దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి వసూలు చేసింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 'రూ. లక్ష పెట్టుబడితో నెల నెలా అసలు, వడ్డీతో కలిపి మొదటి 10 నెలలు రూ.15వేల చొప్పున, తర్వాత 20 నెలలు రూ.12,500 చొప్పున చెల్లిస్తాం. 30 నెలల్లో రూ.4 లక్షలు పొందండి' అంటూ ఈ సంస్థ ప్రచారం చేసింది. అలాగే పెట్టుబడులను స్టాక్ మార్కెట్‌లో పెట్టి అధిక లాభాలు సాధించి తమకు భారీ రాబడులు అందిస్తామని ఈ సంస్థ హామీ ఇచ్చిందని బాధితులు చెబుతున్నారు.
జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ హామీలను నమ్మి పలువురు రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సంస్థ చెల్లింపులు నిలిపివేసినట్లు బాధితులు తెలిపారు. నెలవారీ చెల్లింపులు రావడం ఆగిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదోనన్న భయంతో పలువురు ఖాతాదారులు కాకినాడలోని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు కార్యాలయాలు ఉన్నాయి. సంస్థలో మొత్తం 7 వేల మందికిపైగా ఖాతాదారులు ఉన్నారు. ఇందులో కాకినాడ జిల్లాకు చెందినవారే 3 వేల మందికిపైగా ఉన్నారు. ఈ సంస్థను పిఠాపురానికి చెందిన మోజెస్ అనే వ్యక్తి ఏర్పాటు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News