సిటీ ఆఫ్ లేక్స్‌గా తిరుపతి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:02 PM
తిరుపతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా నగరాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో రూ.750 కోట్లతో తుడా ప్రతిపాదన
సూత్రప్రాయంగా అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
(తిరుపతి, ఆంధ్రజ్యోతి)
తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్‌గా తీర్చిదిద్దుతామని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో వాతావరణ అనుకూల సమగ్ర జల నిర్వహణ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీంతో ఏకంగా రూ.750 కోట్ల భారీ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. తిరుపతి, పరిసరాల్లోని పాతిక చెరువులను అభివృద్ధి చేయడం ఇందులో కీలకాంశం.
తిరుపతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా నగరాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుపతి భవిష్యత్తులో కీలక నగరంగా ఆవిర్భవిస్తుందని, దానికనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. భవిష్యత్తులో తిరుపతిలో తాగునీరు, భూగర్భ జలాల సమస్య తలెత్తకుండా వర్షపు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తుడా, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా దీనిపై దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
తుడా ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇలా..
సీఎం దృష్టికోణానికి అనుగుణంగా తుడా ప్రాథమికంగా రూ.750 కోట్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. తిరుపతిలోని చారిత్రక చెరువులు, కుంటలు, కాలువల వ్యవస్థను పునరుద్ధరించి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సమగ్ర చెరువుల అభివృద్ధి, వరద నియంత్రణ, స్థిరమైన నగరాభివృద్ధి లక్ష్యాలుగా పేర్కొంది. ‘గతంలో తిరుపతి, పరిసరాల్లోని చెరువులు, కుంటలు, కాలువలు పరస్పరం అనుసంధానమై సహజ జల మార్గాలుండేవి. ఇవి వరదలను తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో కీలక పాత్ర పోషించేవి.
అయితే నగరం వేగంగా విస్తరించి అభివృద్ధి చెందే క్రమంలో ఎక్కడికక్కడ పూడికలు పేరుకుపోవడం,చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, అనుసంధాన కాలువలు తెగిపోవడం, ఆక్రమణలు, మురికినీటి ప్రవాహాలు వంటి కారణాలతో ఈ వ్యవస్థ బలహీనపడింది. 2021 నవంబరులో సంభవించిన భారీ వరదలతో ఈ సమస్య తీవ్రత తెలిసివచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం చెరువుల సుందరీకరణకే ప్రాజెక్టును పరిమితం చేయకుండా చెరువుల పునరుద్ధరణ, పరస్పర అనుంధానం, వర్షపు నీటి పారుదల వ్యవస్థ బలోపేతం, భూగర్భ జలాల పెంపు, వరదలొచ్చినప్పుడు నీరు నిలిచిపోయే సమస్యల నివారణ, చెరువుల్లోకి మురుగు, ఘన వ్యర్థాలు చేరకుండా నిరోధించడం’వంటి సమగ్ర చర్యలను ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించింది.
లెక్కలిలా..
చెరువుల పునరుద్ధరణ, అనుసంధానానికి రూ.250 కోట్లు, సమగ్ర వర్షపు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.250కోట్లు, ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి పరిపాలనా వ్యయం, డీపీఆర్‌ల తయారీ, ప్రాజెక్టు నిర్వహణ, అధ్యయనాలు, భూసేకరణ తదితర అవసరాలకు మరో రూ. 250 కోట్లు చొప్పున మొత్తం రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రాథమికంగా ప్రతిపాదించింది.
తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్‌గా రూపొందించేందుకు రూ.750 కోట్లతో తుడా చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ప్రాజెక్టును సిద్ధం చేయడం, డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ.. వరదల అధ్యయనం, పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనాలు, ఆర్థిక విశ్లేషణ, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియలకు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరు నెలల్లో డీపీఆర్ రూపొందించాలని, ఆర్థిక వనరుల సమీకరణ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం తుడా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, జలవనరుల శాఖలను ఆదేశించింది.
ఈ ప్రాజెక్టుకు అదనంగా జర్మనీకి చెందిన కేఎ్‌ఫడబ్ల్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు నుంచి సుమారు రూ.500కోట్ల రాయితీతో కూడిన రుణ సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖను ఆదేశించింది. మొత్తానికీ సీఎం చంద్రబాబు చొరవతో తిరుపతి నగర సుందరీకరణకు కీలక ముందడుగు పడినట్టయింది.
చేపట్టే పనులు
తిరుపతి పరిసరాల్లో సుమారు 25 చెరువుల పునరుద్ధరణ
సహజ జలమార్గాల పునరుద్ధరణ
చెరువుల కట్టలు, తూములు, కాలువల బలోపేతం
పూడిక తొలగింపు, లోతు పెంపు
చెరువులు, కాలువలకు రక్షణ గోడల నిర్మాణం
ప్రజలకు అనుకూలమైన పార్కులు, బహిరంగ ప్రదేశాల అభివృద్ధి
కాలుష్య నియంత్రణ
బ్లూ, గ్రీన్ మౌలిక సదుపాయాలు
ముఖ్యంగా అవిలాల చెరువును హైదరాబాదు ట్యాంకు బండ్ తరహాలో అభివృద్ధి చేయడం.
వర్షపు నీటి పారుదల వ్యవస్థలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను విస్తరించడం, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, ఆ ధునిక పట్టణ రూపకల్పన వంటివి.
ప్రాజెక్టు పూర్తయితే ప్రయోజనాలు
తిరుపతిలో వరదల ప్రమాదం తగ్గుతుంది.
చారిత్రక కుంటలు, చెరువులు పునరుద్ధరించబడతాయి.
భూగర్భ జలాలు పెరుగుతాయి.
పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుంది
ప్రజలకు, యాత్రికులకు మెరుగైన బహిరంగ ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయి.
తిరుపతి ఒక స్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకునే దేవాలయ నగరంగా అభివృద్ధి చెందుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:\
‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్
మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News