పట్టాలెక్కనున్న 8 ఎర్రరైళ్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:45 PM
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
16 నుంచి అందుబాటులోకి
తిరుపతి: దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి. తిరుపతి-పూరి, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడటౌన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీకి రైల్వేశాఖ మార్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పెరంబదూర్‌లో నూతన ఎర్రబోగీలతో సహా 130కిలోమీటర్ల వేగంతో నడిచే పచ్చరంగు ఇంజన్లు తయారయ్యాయి.
మొత్తం ఎనిమిదిరైళ్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పట్టాలెక్కించి విశాలంగా కడప జిల్లా ప్రొద్దుటూరు రైల్వేయార్డ్‌కు, రామేశ్వరం రైల్వేస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతానికి అక్కడ తుది పరీక్షలు జరుగుతున్నాయి. కాలానుగుణంగా తయారుచేసిన ఈ రైళ్లలో మెరుగైన సదుపాయాలను పొందుపరిచారు. డోర్స్, ఏసీ, ఫ్యాన్స్, లైటింగ్, వాటర్, బాత్‌రూమ్స్, బ్రేక్‌సిస్టమ్, స్పీడు, కంట్రోల్, బెర్తు, సీటింగ్ కెపాసిటీ పెంచడం వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.

తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 17480-17479) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాలలో నడుస్తాయి.తిరుపతి-బిలా్‌సపూర్(నెంబర్లు 17482-17481) గురు, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. ఈ నాలుగు నూతన రైళ్లు 18బోగీలతో ఈనెల 16న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున పూరి నుంచి మరొకటి బయల్దేరతాయి. 19న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున బిలా్‌సపూర్ నుంచి మరొకటి బయల్దేరుతాయి.
తిరుపతి-అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 12765-12766) మొత్తం 15బోగీలతో ఈ నెల 21న తిరుపతి నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు వారంలో రెండురోజులు అంటే మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది.
తిరుపతి-కాకినాడటౌన్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 17249-17250) మొత్తం 22బోగీలతో ఈ నెల 22న తిరుపతి నుంచి ఒకటి అదే రోజున కాకినాడ నుంచి మరొకటి బయల్దేరతాయి.
తిరుపతి-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్(నెంబర్లు 16780-16779) మొత్తం 17బోగీలతో ఈనెల 26న రామేశ్వరంలో బయల్దేరి 27న తిరుపతికి చేరుకుంటుంది.ఈ రైలు సోమ, బుధ,శుక్ర, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య
Read Latest Telangana News and National News