Share News

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

ABN , Publish Date - Mar 11 , 2026 | 01:17 PM

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన హయాంలో జరిగిన ఫిరాయింపులపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి
MLA Kadiyam Srihari

హైదరాబాద్, మార్చి 11: అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) స్వాగతించారు. బుధవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు తనకు మాత్రమే వర్తింస్తాయా? కేసీఆర్‌కు వర్తించవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన హయాంలో జరిగిన ఫిరాయింపులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ క్షమాపణ చెప్పితే నేను రాజీనామాకు సిద్ధం’ అని స్పష్టం చేశారు.


ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేసీఆర్ మంత్రులుగా చేయలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ శాసనసభా పక్షం బీఆర్‌ఎస్‌లో విలీనం కాకముందే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిని చేశారని, ఇది నైతికమా? అని సవాల్ విసిరారు. రాజకీయంగా తమను ఎదగకుండా చేయడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారని కడియం శ్రీహరి ఆరోపించారు. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్‌ను ఆరు జిల్లాలుగా చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని సిద్ధాంతపరంగా విభేదించానని ఎమ్మెల్యే అన్నారు.


మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడానికే తన స్థానంలో సబితను విద్యా శాఖ మంత్రిని చేశారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు తాను వ్యతిరేకమని.. అన్ని విషయాలు త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తనకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎదుర్కొంటానని.. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 01:19 PM