గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:31 PM
గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
కుప్పం, జులై 5 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. హింస, అసభ్యతలనే గొడ్డలి పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని జగన్ ప్రొత్సహిస్తున్నారని ఆగ్రహించారు. హంద్రీ - నీవా కాలువ ద్వారా కుప్పం వరకూ నీరు తీసుకువచ్చామని తెలిపారు. త్వరలో గాలేరు నగరిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు (ఆదివారం) కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు
ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. ఈ నియోజకవర్గానికి రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారని వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని ఇలాగే తీర్చిదిద్దుతామని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలూ ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికలు చేశామని వెల్లడించారు. ఏపీలో క్వాంటం, సెమీ కండక్టర్ల విభాగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వివరించారు.
అందుబాటులోకి అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాలు..
ఇంధన రంగంలోనూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ప్రముఖ స్టీల్ పరిశ్రమలు ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ కంపెనీలు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే కొందరు అడుగడుగునా అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారని ఆగ్రహించారు.
విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యాయి..
జగన్ హయాంలో విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఓబుళాపురంతో పాటు ఆన్ రాక్ కూడా ఈ తరహాలోనే ఇబ్బందుల్లో పడిందని చెప్పారు. ఆయా కంపెనీలను తరిమేయటం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయటమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతీ ప్రాజెక్టునూ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాస్తవం లేకపోయినా అదే పనిగా అసత్యాలు చెబితే ఎవరేం చేయగలరని అన్నారు. వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం కూడా డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించిందని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News