MLA Birthday Controversy: సొమ్ము ఒకరిది.. సోకు ఆయనది!
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:10 AM
పుట్టిన రోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి.. స్థాయికి తగినట్లుగా చేసుకుంటారు. అదే డబ్బున్న వారయితే విందులు, వినోదాలతో కొంత హడావుడి చేస్తారు.
ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల జేబులకు చిల్లు
వేడుకల ఖర్చుకు బలవంతంగా లక్షల్లో వసూళ్లు
వేలాది మందికి ‘గొప్ప’ విందుతో సంబరాలు
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పుట్టిన రోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి.. స్థాయికి తగినట్లుగా చేసుకుంటారు. అదే డబ్బున్న వారయితే విందులు, వినోదాలతో కొంత హడావుడి చేస్తారు. అయితే.. ఈ విషయంలో ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే తీరు మాత్రం ‘సొమ్ము ఒకరికి.. సోకు ఒకరిది’ అన్నట్లుగా ఉంది! తన నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ శాఖలు ఉద్యోగులు, కాంట్రాక్టర్లతో పాటు చోటా నాయకుల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేసి.. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా వేలాది మందికి ‘గొప్పగా’ భోజనాలు పెట్టించారు!! డబ్బులు ఇవ్వకుంటే ‘బదిలీ’ వేటేనని బెదిరించడంతో గత్యంతరం లేని ఉద్యోగులు ‘విరాళాలు‘ సమర్పించుకున్నారు. దీంతో ఈ విధంగా డబ్బులు దండుకోవడం ఏంటో.. అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆశ పడటంలో తప్పులేదు! కానీ, అందుకు వసూలు డబ్బుతో సంబరాలు నిర్వహించడమే చర్చనీయాంశంగా మారింది. గతేడాది కూడా ఆయన ఇదేవిధంగా తన పుట్టినరోజుకు ఉద్యోగులకు టార్గెట్లు విధించి, డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. ఇద్దరు సీనియర్ నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో సదరు ప్రజాప్రతినిధి వసూళ్లపై మాట్లాడిన మాటల ఆడియో బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇంటికి పిలిపించి.. డబ్బులు డిమాండ్
బర్త్‌డే సంబరాలకు తన జేబు నుంచి ఖర్చు పెట్టకుండా.. ఆ భారం ఇతరులపై మోపడంపై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నాటి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారం రోజులుగా ప్రణాళికలు వేశారు. అందుకు తగ్గట్లే 30 వేల మందికి తగ్గకుండా జనాల్ని రప్పించి భోజనాలు పెట్టారు. క్రీడా, ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందుకు లక్షల్లోనే ఖర్చు అయ్యింది. ఈ మొత్వాన్ని ఆ నేత తన జేబులో నుంచి పెట్టుకోకుండా... మండలస్థాయి అధికారుల నుంచి చిరుద్యోగుల వరకు తేడా లేకుండా వసూలు చేశారు. ముందుగానే ఆ ప్రజాప్రతినిధి పలు శాఖల అధికారులను ఇంటికి రప్పించి.. భోజనాల ఖర్చులకు కొంత నగదు ఇవ్వాలని హుకుం జారీచేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఐదు నుంచి ఎనిమిది వేల మందిని మహిళలను పంపాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, డ్వాక్రా సీఎ, సీసీలు, ఉపాధి హామీ తదితర శాఖల నుంచి లక్ష నుంచి రెండు లక్షల చొప్పున వసూలు చేశారు. కాంట్రాక్టర్లు, చోటా నాయకుల జేబులు సైతం ఖాళీ కావడంతో తమకు సంక్రాంతి పండుగ ముందే కనిపించిందని వారు వాపోయారు.
భవిష్యత్‌లో ఎలా పనిచేస్తారో చూస్తా?
తన మాట పెడచెవిన పెట్టిన వారిని దృష్టిలో పెట్టుకుంటానని, భవిష్యత్‌లో విధులు ఎలా నిర్వహిస్తారో చూస్తామని ఆ ఎమ్మెల్యే ఉద్యోగులకు హెచ్చరికలు చేశారు. దీంతో కొందరు గత్యంతరం లేక భారీగానే తాంబూలం సమర్పించుకున్నారు. మరోవైపు పెట్టిన టార్గెట్‌ను అందుకోలేని వారిపై బదిలీ వేటు తప్పదని ఆయన అనుచరగణం బెదిరించింది. ఓ రెవెన్యూ అధికారి వద్ద ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో వచ్చే కమీషన్ దక్కాలంటే ముందుగా రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పి, అనుచరుల ద్వారా నగదు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.