Share News

నల్లమలలో అపూర్వ శాసనాలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:51 AM

దట్టమైన నల్లమల అడవులు ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఖజానా. అందులో దాగిన చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

నల్లమలలో అపూర్వ శాసనాలు
Nallamala Forest

దట్టమైన నల్లమల అడవులు ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఖజానా. అందులో దాగిన చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో శతా బ్దాలనాటి మసమ్మ సరాయి, రాతి శాసనాలు, పురాతన దేవాలయాల శిథిలాలు, శ్రీశైలం వెళ్లే పురాతన కాలంనాటి కాలిబాటలు, పాత వాణిజ్య మార్గాలు ఎన్నో...

ఇటీవల పురావస్తు శాఖ శాసన శాస్త్ర

నిపుణుల బృందం గుర్తించిన ఆనవాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ చారిత్రక వారసత్వాన్ని... నల్లమల సహజ సౌందర్యాన్ని మేళవించి, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.

చారిత్రక కట్టడాల పరిరక్షణ, వాటి చరిత్రను ప్రజలకు చేరవేయడం, ట్రెక్కింగ్‌ మార్గాల ఏర్పాటు, చెంచు గిరిజనుల సంస్కృతిని ప్రజలకు చేరవేయడం ద్వారా నల్లమలను దేశంలోనే ప్రత్యేక ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నారు.


నల్లమల అటవీ ప్రాంతంలో పురాతన ఆనవాళ్ల వెలికితీత కోసం... పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిపుణుల బృందం సాహసోపేత శాసన సర్వే కోసం ప్రభుత్వ అనుమతి కోరింది. అభయారణ్యంలోని జంతుజాలానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సర్వేకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీంతో సర్వే బృందం జూన్‌ 11 నుంచి 13 వరకు నల్లమల అటవీ ప్రాంతంలో పరిశోధన చేసింది. ఈ సందర్భంగా సుమారు 20 నుంచి 25 శాసనాలను గుర్తించినట్టు తెలిపారు.


book6.2.jpgచరిత్రకు సాక్ష్యాలు... ఈ శాసనాలు...

నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల సమీపంలో మూడు శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలన్నీ క్రీ.శ. 15-16 శతాబ్దానికి చెందిన తెలుగు భాషలోని లిపిగా గుర్తించారు. ఇందులో మొదటి శాసనం అక్షయ, శ్రావణ, 10వ శుక్షేత్రంలో గురజాలకు చెందిన లింగబట్టు కుమారుడైన జంగం అనే వ్యక్తి పోలేరమ్మకు ఉయ్యాల కంబాలు నిర్మించి నట్టు తెలుస్తోంది. రెండో శాసనం పాలుట్లకు చెందిన బేపిక అనే వీరుడు పులితో పోరాడుతున్న దృశ్యం. మూడో శాసనం పౌర్ణమిరోజున శ్రీకరుడు తల్లిదండ్రుల పుణ్యఫలంగా తన మామిడి తోటలోని కనుమదేవుని ఆలయానికి ఆరు పుట్ల భూమిని (దాదాపు 6 ఎకరాలు) దానం చేసినట్టు ఉంది.


పాలుట్ల సమీపంలో లభ్యమైన అతి ప్రాముఖ్యమైన శాసనాల్లో పోలేరమ్మ ఆలయం వద్ద నంది స్తంభ శాసనాన్ని గుర్తించారు. దీనిని క్రీ.శ. 1358 (నళనామ సంవత్సరం, కార్తీక శుద్ధనవమి, గురువారం) రెండో దేవరాయల కాలం నాటిదిగా పేర్కొన్నారు. లభించిన ఆధారాలను బట్టి విజయనగర సామ్రాజ్య కాలంలో పాలుట్ల గ్రామం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నంది స్తంభంపై ఉన్న వివరాలను డీకోడ్‌ చేయగా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలోని రాజుగారి శ్రీ పర్వతానికి చెందిన భిక్షవృత్తి అయ్యగారికి ఉదయగిరి రాజ్యంలో రెండు గ్రామాలను, పాలుట్ల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు ఉంది. ఈ దానంలో కోరు సుంకం (మెట్ట భూముల పన్ను), వన ఆదాయం (అటవీ ఉత్పత్తుల ఆదాయం) నువ్వులు, చింతపండు వంటి వాటిపై కొనుగోలు, అమ్మకాలపై పన్ను వంటి హక్కులున్నాయి.


book6.3.jpgశివాలయం... సరాయి...

నల్లమలలోని మీథోట గ్రామం వెలుపల మైసమ్మ గుట్ట సమీపంలో పురాతన శాసనం ఒకటి లభ్యమైంది. ఇది శక 1360 అంటే...క్రీ.శ. 1438 అక్టోబర్‌ 5 నాటిదిగా గుర్తించారు. శ్రీపర్వతంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో పీఠాధిపతి అయిన భిక్షవృత్తి అయ్యగారు మీథోట గ్రామానికి చెందిన పలు భూములను అక్కడి కండేశ్వర ఆలయంలో పూజలు, నైవే ద్యాల కోసం నిరంతరం దీపం వెలిగించడం కోసం దానం చేసినట్టు ఉంది. మీథోట వద్ద పురాతన శివాలయం చారిత్రక కట్టడంగా గుర్తించారు.


శ్రీశైలం వెళ్లే యాత్రికులు నడక ద్వారా అడవిలోకి వెళ్లేటప్పుడు... విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని ‘మసమ్మ సరాయి’ (సరాయి అంటే విశ్రాంతి స్థలం)గా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి ఆలయం శిథిలమై కనిపించగా శివలింగం, నంది విగ్రహం, ఇతర రాతి శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆల యం పక్కనే ఉన్న నీటిగుంట ఒకప్పుడు యాత్రికులు, పూజారులకు ఉపయోగపడినట్టు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితమే నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ఈ ఎకో టూరిజం దోహదపడే అవకాశాలున్నాయి. ఇటీవల గుర్తించిన శాసనాలు నల్లమలకు మరింత శోభను తీసుకొస్తాయని పర్యాటక నిపుణులు అంటున్నారు.

  • బంకా శ్రీనివాస్‌, మార్కాపురం


పర్యాటకానికి సరికొత్త సొబగులు...

నల్లమలలో ఇటీవల లభించిన చారిత్రక ఆనవాళ్లు అత్యంత ముఖ్యమైనవి. నాటి చారిత్రాత్మక అంశాలను పర్యాటకులు తెలుసుకోవడానికి ఎకో టూరిజం తోడ్పడుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.

  • డాక్టర్‌. మునిరత్నంరెడ్డి, డైరెక్టర్‌, ఆర్కియాలజీ విభాగం


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 10:51 AM