Share News

బయోస్పియర్‌.. భూమికి ప్రత్యామ్నాయమా?

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:45 AM

భూమిలాంటి మరో చోట నివాసం ఏర్పరచుకుని జీవించొచ్చా? భూమిపై ఉండే వాతావరణాన్ని... ఒక గాజు ప్రపంచంలో సృష్టిస్తే నివాసయోగ్యంగా ఉంటుందా? చంద్రుడిపైనో లేదంటే అంగారకుడిపైనో మానవుడు స్వయం సమృద్ధితో జీవించగలడా? ఇవే ఆలోచనలు శాస్త్రవేత్తలను ‘బయోస్పియర్‌ 2’ పేరుతో ఒక వినూత్న గాజు ప్రపంచాన్ని సృష్టించేందుకు పురిగొల్పాయి.

బయోస్పియర్‌.. భూమికి ప్రత్యామ్నాయమా?
Biosphere

భూమిలాంటి మరో చోట నివాసం ఏర్పరచుకుని జీవించొచ్చా? భూమిపై ఉండే వాతావరణాన్ని... ఒక గాజు ప్రపంచంలో సృష్టిస్తే నివాసయోగ్యంగా ఉంటుందా? చంద్రుడిపైనో లేదంటే అంగారకుడిపైనో మానవుడు స్వయం సమృద్ధితో జీవించగలడా? ఇవే ఆలోచనలు శాస్త్రవేత్తలను ‘బయోస్పియర్‌ 2’ పేరుతో ఒక వినూత్న గాజు ప్రపంచాన్ని సృష్టించేందుకు పురిగొల్పాయి. పరిశోధనల్లో చివరకు వాటి ఫలితాలు శాస్త్రవేత్తలను విస్తుపోయేలా చేశాయి. ఆ విశేషాలే ఇవి...

అమెరికాలోని అరిజోనా ఎడారి... 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ గాజు నిర్మాణం. భూవాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి... మనుషుల నివాసానికి పనికొస్తుందా? అని తెలుసుకునేందుకు చేపట్టిన ఆ ప్రయోగం పేరు ‘బయోస్పియర్‌ 2’. ఇందుకోసం గాజు నిర్మాణంతో పాటు... ఎనిమిది మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. ఆ గాజు ప్రపంచంలో చిన్న సముద్రం, ఉష్ణమండల ప్రదేశం, ఎడారి, చిత్తడి నేల (వెట్‌ల్యాండ్‌), గడ్డి మైదానాలు వంటి విభిన్న పర్యావరణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటంటే... గాజు ప్రపంచంలో అడుగుపెట్టిన ఎనిమిది మంది రెండేళ్ల పాటు పూర్తిగా, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించాలి. వారికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకోవాలి. అక్కడ పరిమిత స్థాయిలో ఉన్న ఆక్సిజన్‌తో నెట్టుకురావాలి. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర గ్రహాలపై మానవ ఆవాసాలను నిర్మించేందుకు ఒక కీలకమైన అడుగుగా నిలిచిపోతుందని పరిశోధకుల అంచనా.


book4.jpgఊహించని పరిణామాలు...

ఈ వినూత్న గాజు ప్రపంచంలోకి అడుగు పెట్టిన శాస్త్రవేత్తలు కూరగాయలు పండించారు. బియ్యం, గోధుమలు సాగు చేశారు. నీటిని రీసైకిల్‌ చేసుకున్నారు. మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్‌పైనే పూర్తిగా ఆధారపడ్డారు. అయితే హఠాత్తుగా అనుకోని సమస్యలు మొదలయ్యాయి. ఆక్సిజన్‌ ప్రమాదకరంగా తగ్గిపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. అలసట పెరిగింది. పనులు చేయడం కూడా ఇబ్బందిగా మారింది. చివరికి బయట నుంచి ఆక్సిజన్‌ పంపించాల్సి వచ్చింది. పంటలు సరిగ్గా పండలేదు. పంటలు ఆశించినంత రాలేదు. లోపల గాలి తగినంత లేకపోవడంతో చెట్లు బలమైన వేర్లు, గట్టి కాండం అభివృద్ధి చేసుకోలేకపోయాయి. కొంతకాలానికి వాటంతట అవే కూలిపోయాయి. ఈ ప్రయోగం ద్వారా చెట్ల ఎదుగుదలకు గాలి కూడా అవసరమే అని నిర్ధారణ అయింది. రెండేళ్ల పాటు ఒకే ప్రదేశంలో ఉండడంతో శాస్త్రవేత్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. వాదనలు చోటు చేసుకున్నాయి. వర్గాలుగా విడిపోయారు కూడా.


book4.3.jpgశాస్త్రవేత్తలకు సవాల్‌...

ఎలాగో చివరికి రెండేళ్లు పూర్తయ్యాక ‘బయోస్పియర్‌ 2’ ప్రయోగాన్ని నిలిపివేశారు. అయితే ఈ ప్రయోగం విఫలమైందని చాలా మంది భావించారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది విఫలం కాదు... అమూల్యమైన పాఠం అని తేల్చారు. వాతావరణ సమతుల్యత ఎంత క్లిష్టమో, భూమిపై జీవవ్యవస్థలు పరస్పరం ఎలా ఆధారపడి ఉంటున్నాయో తెలియ జేసిందని అన్నారు. 2007లో బయోస్పియర్‌ 2ని అరిజోనా విశ్వవిద్యాలయానికి అందించాక, శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగించడం ప్రారంభించారు.


ప్రస్తుతం అక్కడ అతి ముఖ్యమైన శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త రకాల పగడపు దిబ్బలను పెంచే పరిశోధనలు, భూవ్యవస్థల అధ్యయనం వంటి పర్యావరణానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిని ప్రజల సందర్శన కోసం తెరిచారు. ప్రస్తుతం బయోస్పియర్‌ పర్యాటకులను ఆకర్షించే విజ్ఞాన కేంద్రంగా మారింది. అయితే మనకు ఉన్న అసలైన బయోస్పియర్‌ భూమి ఒక్కటే. దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఈ ప్రయోగం గుర్తు చేసిందనే చెప్పాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 10:07 AM