Share News

పేపర్‌ లీకులకు ఇక చెక్‌!

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:01 AM

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్‌ పరీక్షల(అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది.

పేపర్‌ లీకులకు ఇక చెక్‌!

  • కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు.. రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి

  • సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

  • రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్రతో చట్టంగా మారిన ‘పబ్లిక్‌ పరీక్షల బిల్లు’

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్‌ పరీక్షల(అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. కొత్త చట్టంలో ప్రశ్నపత్రాల లీకేజీ, ఓఎంఆర్‌ షీట్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించడం, ఫేక్‌ అడ్మిట్‌కార్డులను జారీచేయడం వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను పేర్కొన్నారు. ఇకపై ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో వేగవంతమైన దర్యాప్తు చేయడంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడనున్నాయి.


రెండు నెలల్లోనే దర్యాప్తును పూర్తి చేయడంతో పాటు వేగవంతమైన విచారణ (చార్జిషీట్‌ దాఖలైన 3నెలల లోపు) కోసం ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నాయి. పేపర్‌ లీకులకు లేదా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అదేవిధంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా కొత్త చట్టంలో నిబంధనలు రూపొందించారు. వ్యవస్థీకృత నేరాల విషయంలో కనీసంగా ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు చేశారు. పేపర్‌ లీకేజీ నిందితులపై జరిమానాలను పెంచడంతో పాటు, శిక్షలను మరింత కఠినతరం చేస్తూ 2024 నాటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.


నీట్‌ యూజీ-2026 లీకేజీ తర్వాత సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన నేపథ్యంలో పేపర్‌ లీకేజీ ఘటనలను విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పేపర్‌ లీకులకు సంబంధించి తీవ్ర వివాదాల నేపథ్యంలో కేంద్రం 2024లో ఓ చట్టం చేసింది. అంతకుముందు కేంద్రం, దాని అనుబంధ సంస్థలు నిర్వహించే పబ్లిక్‌ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఎలాంటి నిర్దిష్టమైన సమగ్రమైన చట్టం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షమించడం కాదు... క్షమాపణ చెప్పండి.. ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

నీట్‌ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట

For More National News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 10:00 AM