నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:49 AM
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు పెద్ద ఊరట. తమ నివాస ప్రాంతానికి సమీపంలోని కేంద్రంలో పరీక్ష రాసే వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాదు కేటాయించిన పరీక్షా కేంద్రంపై మూడు వారాల ముందే అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు.
210 నిమిషాల పరీక్షలో ఇకపై 180 ప్రశ్నలే
ఇంటికి దగ్గర్లోనే సెంటర్..దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో పరీక్ష
న్యూఢిల్లీ: నీట్ పీజీ 2026 అభ్యర్థులకు పెద్ద ఊరట. తమ నివాస ప్రాంతానికి సమీపంలోని కేంద్రంలో పరీక్ష రాసే వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాదు కేటాయించిన పరీక్షా కేంద్రంపై మూడు వారాల ముందే అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలో ప్రశ్నలను కుదించాలని నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం మేరకు.. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు మరింత సమయం లభించనుంది. 210 నిమిషాల్లో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలను గతంలో రాయాల్సి ఉండేది. ఇకపై 180 ప్రశ్నలతోనే పరీక్ష ఉంటుంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను ఒకే షిఫ్ట్‌లో పూర్తి చేయనున్నారు. గతంలో మొదట వచ్చిన దరఖాస్తులకు, మొదటి ప్రాతిపదికన పరీక్షా కేంద్రాలు కేటాయించేవారు. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు సుదూరం ప్రయాణించి పరీక్ష రాయాల్సి వచ్చేది. ఇక ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ధృవీకరణ విఫలమైతే, కనుబొమ్మల(ఐరిస్) ఆధారిత ధృవీకరణను అనుమతించనున్నారు. ఆగస్ట్ 30న దేశవ్యాప్తంగా 340 పట్టణాల్లో, 1,300 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 2,73,183 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షమించడం కాదు... క్షమాపణ చెప్పండి.. ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
For More National News And Telugu News