Share News

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:42 AM

తొలకరి జల్లులు పడుతుంటే.. ‘అరెరె వానా.. జడివాన..’ అంటూ మనసు ఉల్లాసంతో ఉరకలెత్తుతుంది.

చిటపట చినుకులు పడుతూ ఉంటే...
chitra jyothy

తొలకరి జల్లులు పడుతుంటే.. ‘అరెరె వానా.. జడివాన..’ అంటూ మనసు ఉల్లాసంతో ఉరకలెత్తుతుంది. ప్రతీ ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా... వర్షంతో పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో ఉంటాయి. ‘అలాంటి మీ అనుభవాలు ఏవైనా చెప్పండి’ అనగానే కొందరు సెలబ్రిటీలు చెప్పిన మాన్‌సూన్‌ ముచ్చట్లివి...

రెయిన్‌ డ్యాన్స్‌...

వర్షం అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. నాకైతే వర్షాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాకూ వర్షానికి ఏదో కనెక్షన్‌ ఉందనిపిస్తుంది. నా ప్రతీ హిట్‌ సినిమాలో ఒక వాన పాట కచ్చితంగా ఉంది. అంటే వర్షం నా అదృష్ట సఖి అన్నట్లే కదా! చిన్నతనంలో వానొస్తుందంటే... బయటకి పరుగెత్తి డ్యాన్స్‌ చేసేదాన్ని. నేను చెల్లితో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దుస్తులు, జుట్టు తడుపుకొని ఇంట్లోకి వస్తే, అమ్మ చేతి దెబ్బలు ఇంకా గుర్తున్నాయి.

  • సాయి పల్లవి


పదే పదే... అదే పాట...

book1.3.jpgవర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఉండడానికే ఇష్టపడతా. ఆ సమయంలో రెయిన్‌ సాంగ్స్‌ వింటూ ఇంట్లోనే డాన్స్‌ చేయడమంటే తెగ ఇష్టం. నా చిన్నప్పటి నుంచి వింటున్న అక్షయ్‌కుమార్‌, రవీనాటాండన్‌ల ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’ పాటని రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరీ డ్యాన్స్‌ చేస్తా. చిన్నతనంలో వానాకాలం వచ్చిందంటే చాలు... కాగితం పడవలు చేసి కాలువల్లో వదిలేదాన్ని. అవి మునిగిపోతే మాత్రం గుక్కపెట్టి ఏడ్చేదాన్ని.

  • నభా నటేష్‌


లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తా...

book2.jpg
వర్షం పడుతున్నంతసేపు ఏదో లోకంలో ఉంటా. దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చిన్నప్పుడు వీధిలో వరద నీటిలో ఆడుకోవడం, తడిసిన కాళ్లతో ఇళ్లంతా పరుగెత్తడం.. అమ్మ తిట్టిన తిట్లు ఇప్పటికీ గుర్తే. వానాకాలంలో అమ్మ చేసే మిర్చీ, ఆలూ బజ్జీలు తినడం బాగుంటుంది. వానలో గొడుగు పట్టుకొని వెళ్లడం, హుషారు ఎక్కువైతే కారు తీసుకొని లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లడాన్ని ఎక్కువగా ఇష్టపడతా.

  • శ్రీలీల


జలపాతాల దగ్గరకు...

book2.2.jpgచిన్నప్పుడు వర్షాకాలం ఎప్పుడు వస్తుందా? అని కుతూహలంగా ఎదురుచూసేదాన్ని. వర్షం పడుతున్నప్పుడు వచ్చే శబ్దం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వర్షంలో తడిస్తే దగ్గు, జలుబు వస్తుందని కాస్త జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టా. ఈ సీజన్‌లో షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకొని మరీ జలపాతాలు ఉన్నచోటుకి వెళ్తుంటా. కొండల మీద నుంచి జాలువారే జలపాతాలను, ఆకాశంలో నుంచి భూమ్మీదకు నేరుగా పడే వర్షం చుక్కల్ని చూస్తూ అలా బతికేయొచ్చేమో అనిపిస్తుంది.

  • అనుపమ పరమేశ్వరన్‌


మట్టి వాసన ఇష్టం

book2.3.jpgతొలకరి జల్లులు పడటానికి ముందు వచ్చే మట్టివాసన అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడైతే మంచం మీద దుప్పటి కప్పుకొని, వాన చప్పుడు వింటూ నిద్ర పోయేదాన్ని. ఇంటి దగ్గర నీళ్లు ఉన్నచోటకు వెళ్లి... వాన నీటి బురదలో బాగా ఆడేదాన్ని. ఆ రోజులు మళ్లీ రావేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే బాల్కనీలో నుంచి లేదంటే కిటికీలో నుంచి వర్షాన్ని చూస్తూ... ఒక కప్పు కాఫీ తాగడం ఇష్టం. వర్షంలోకి వెళ్లేటప్పుడు ఫోన్‌ కన్నా, నా జుట్టు గురించే ఎక్కువగా కేర్‌ తీసుకుంటా.

  • రష్మిక మందన్నా


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 09:11 AM