భోగాపురం.... వెల్లివిరిసిన ఉత్సాహం
ABN , Publish Date - Aug 02 , 2026 | 01:21 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు. భారీ పెట్టుబడులకు నెలవు. యువతకు ఉపాధి అవకాశాల కొలువు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.
అట్టహాసంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం
ఉత్తరాంధ్ర దిశ,దశ మారుతుందన్న ప్రముఖులు
పండుగ వాతావరణంలో కార్యక్రమం
భారీగా తరలివచ్చిన జనం
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు. భారీ పెట్టుబడులకు నెలవు. యువతకు ఉపాధి అవకాశాల కొలువు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ, ఇది సాధారణ విమానాశ్రయం ప్రారంభోత్సవం కాదని, ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత కార్యక్రమం అని, పెట్టుబడుల ప్రవాహానికి ప్రారంభోత్సవం అని వెల్లడించారు. ఇకపై ఏ నగరంలోను ఉత్తరాంధ్ర కార్మికులకు చెందిన వలస కాలనీలు ఉండవని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఉపాధికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఉద్యోగ అవకాశాలే వెదుక్కుంటూ ఇక్కడికి వస్తాయని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర...ఉత్తమాంధ్రగా మారబోతున్నదని గట్టిగా నొక్కి చెప్పారు.
ప్రభం‘జనం’
సభా స్థలంలో ఖాళీ లేక రోడ్డుపై నిల్చుని ప్రసంగాన్ని విన్న వేలాది మంది
అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు. సభా స్థలి అంతా కిటకిటలాడింది. వేదిక లోపల స్థలం లేక వేలాది మంది బయటే ఉండిపోయారు. వారంతా బస్సుల్లో నుంచి, బస్సుల పైనుంచి అధినేతల ప్రసంగాలను విన్నారు. ఉదయం 9.30 గంటలకే సభా ప్రాంగణం నిండిపోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన వారిని పోలీసులు లోపలకు అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు.
ఫ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోపాటు ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మెహన్ నాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి సభావేదికపై ఆశీనులు కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రదేశంలో కూర్చొన్నారు.
ఫ ఎయిర్‌పోర్టు సభా ప్రాంగానికి ప్రధాని నరేంద్రమోదీ 11.35 గంటలకు చేరుకొన్నారు. తొలుత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన హిందీలో ఉపన్యాసించగా దానిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో వివరించారు.
ఫ ధింసా నృత్యానికి ప్రధాని ప్రశంస
ప్రధాని నరేంద్రమోదీ రాకను పురస్కరించుకుని 13 వేల మంది గిరిజన బాలికలు సంప్రదాయ గిరిజన నృత్య రూపకమైన థింసాను ప్రదర్శించారు. నృత్యరూపకంతో స్వాగతం పలికారు. ఆత్మీయ స్వాగతానికి ప్రధాని అబ్బురపడ్డారు. కళాకారులను అభినందించారు.
అతిపెద్ద పారిశ్రామిక క్లస్టర్‌గా వీఈఆర్
ఈ చివరి నుంచి ఆ చివరికి కోస్టల్ కారిడార్ నిర్మిస్తాం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
‘‘తీర ప్రాంతం ఎక్కువ కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను బ్లూ ఎకానమీగా మారుస్తాం. ఈ చివరి నుంచి ఆ చివరికి కోస్టల్ కారిడార్ నిర్మిస్తాం. పోర్టులు. ఎయిర్‌పోర్టులు అనుసంధానిస్తాం. విశాఖపట్నం పోర్టు నుంచి కృష్ణపట్నం వరకూ పాతపోర్టులను ఆధునికీకరిస్తున్నాం. మూలపేట, రామాయపట్నంలలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నాం. విశాఖ-రాయిపూర్ హైవే రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక క్లస్టర్‌గా మారుతుంది. గత మూడేళ్లలోనే ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ప్రారంభించాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు సహకరిస్తాం. సీఎం చంద్రబాబు రాత్రి, పగలు కష్టపడుతున్నారు. ఇక్కడ పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన వాతావరణం ఉంది.’’
గోదావరి, వంశధార అనుసంధానం
సీఎం నారా చంద్రబాబునాయుడు
‘‘పోలవరం నీరు ఈ నెల 14వ తేదీకే అనకాపల్లి తీసుకువస్తాం. గోదావరిని వంశధారతో అనుసంధానిస్తాం. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర దిశ, దశ మారుస్తుంది. ఇక ఎక్కడా ఉత్తరాంధ్ర ప్రజల వలస కాలనీలు ఉండవు. ఇక్కడికే అంతా వలస వస్తారు. అందరికీ అవకాశాలు కల్పిస్తాం. ఉపయోగించుకోవాలి.’’
మోదీకి అండగా ఉందాం
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్
‘‘పండ్లున్న చెట్టుకే దెబ్బలు. అలాగే పరిపాలన బాగా చేసేవారినే విమర్శిస్తారు. ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి ఏది కావాలన్నా ఇస్తున్నారు. అటువంటి వ్యక్తిగా అండగా ఉన్నప్పుడు మరింత అభివృద్ధి సాధ్యం.’’
ఏపీకి పవర్ ఇంజన్ ఉత్తరాంధ్ర
ఐటీ మంత్రి నారా లోకేశ్
‘‘ఏపీకి ఉత్తరాంధ్ర పవర్ ఇంజన్ లాంటిది. నంబర్‌వన్ స్థానంలో ఉండేలా అభివృద్ధి చేస్తాం. ప్రధాని గత రెండేళ్లలో ఏపీకి రావడం ఇది ఐదోసారి. గుజరాత్ తరహాలో ఏపీ అభివృద్ధి చెందాలంటే ఎన్‌డీఏకు మద్దతుగా ఉండాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు. ఇది ఈస్ట్ కోస్టల్ ఇండియా. డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు ఉత్తరాంధ్రాకే వస్తున్నాయి. ఉస్తాద్ భగత్‌సింగ్ పవన్ అన్న అండగా ఉన్నారు. ఏమైనా సాధిస్తాం.’’