Share News

ఏయూలో ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:23 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఏయూలో ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు

ఒకే కోర్సులో వేర్వేరు విద్యా విభాగాలకు సంబంధించిన సబ్జెక్టులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు

పాఠ్యాంశాల రివిజన్‌కు సూచనలు

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. గడిచిన ఏడాది క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సును ప్రవేశపెట్టగా, ఈ ఏడాది వీఎల్‌ఎస్‌ఐ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరికొన్ని కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న డిసిప్లినరీ/సింగిల్‌ డిసిప్లిన్‌ కోర్సులకు బదులుగా ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులను ప్రారంభించడం ద్వారా విభిన్న రంగాల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కరిక్యులం రివిజన్‌ (పాఠ్య ప్రణాళిక సవరణ) కోసం నియమించిన కమిటీలకు పలు సూచనలు చేశారు. ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ విభాగాల్లో ఈ కొత్త కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త కోర్సులు ఎలా..?

ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యా విభాగాలకు సంబంధించిన సబ్జెక్టులను కలిపి ఒక కోర్సుగా నిర్వహించడం. ఉదాహరణకు గణితం, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి విభాగాలను కలిపి ఒక కోర్సుగా ప్రారంభించవచ్చు. ఇలా విభిన్న సబ్జెక్టులతో కూడిన కోర్సులను ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్‌, సైన్స్‌, లా, ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోని ప్రధానమైన సబ్జెక్టులతో సరికొత్త కోర్సులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. వచ్చే ఏడాది కనీసం మూడు నుంచి ఆరు ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులతో విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం తప్పనిసరిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సుల గురించి ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు.


ఎఫ్‌ఏ పరీక్షలు వాయిదా

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

పాఠశాలల్లో మొదటి ఎఫ్‌ఏ (ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారమైతే ఈనెల మూడో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే 17వ తేదీకి వాయిదా వేస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులు అసెస్‌మెంట్‌ పరీక్షలు రాసేందుకు ముద్రించిన పుస్తకాలు పాఠశాలలకు అందకపోవడంతో పరీక్షలు వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్‌ మేరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు, ఆరు నుంచి పదో తరగతి వరకు 17వ తేదీ నుంచి 20 తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 01:23 AM