ట్రోలింగ్‌ను తొక్కేసి నిలబడతా
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:33 AM
బాలీవుడ్‌లో గ్లామర్ అంటే జీరో సైజ్ కొలతలేనా? ప్రతిభను పక్కనపెట్టి శరీరాకృతిని బట్టి ఒక నటి భవిష్యత్తును నిర్ణయిస్తారా? ఈ వివక్షను, దీని వెనుక ఉన్న సామాజిక జాడ్యాన్ని ప్రశ్నిస్తున్నారు నటి అంజలి ఆనంద్.
బాలీవుడ్‌లో గ్లామర్ అంటే జీరో సైజ్ కొలతలేనా? ప్రతిభను పక్కనపెట్టి శరీరాకృతిని బట్టి ఒక నటి భవిష్యత్తును నిర్ణయిస్తారా? ఈ వివక్షను, దీని వెనుక ఉన్న సామాజిక జాడ్యాన్ని ప్రశ్నిస్తున్నారు నటి అంజలి ఆనంద్. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో తన నటనతో మెప్పించిన ఆమె.. భారీ మల్టీస్టారర్ ‘ధమాల్ 4’ సినిమా ప్రమోషన్ల వేళ తనపై జరిగిన ఆన్‌లైన్ ట్రోలింగ్, బాడీ షేమింగ్‌పై గళమెత్తారు. తనలోని నటిని చూడకుండా తన బరువును తప్పుబడుతున్న సమాజంపై ఆమె వ్యక్తంచేసిన ఆవేదన ఆమె మాటల్లోనే...
గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంటే జీరో సైజ్ శరీరంతో మెరిసిపోవడమేనా? ఈ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. నేను ఒక నటిని. నా పని నటన ద్వారా ప్రేక్షకులను అలరించడం, పాత్రల్లో జీవించడం. కానీ, దురదృష్టవశాత్తు ఈ సమాజం నా నటనను, నా కష్టాన్ని గుర్తించడానికి ముందే నా శరీర బరువును చూస్తోంది. ఒక కళాకారిణిగా నా నైపుణ్యాలను అంచనా వేయడానికి బదులు, శారీరక కొలతల చట్రంలోనే నన్ను బంధించాలని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. నా ఉద్యోగం (నటన) కంటే నా బరువు గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నప్పుడు నా మనసు గాయపడుతుంది. అయితే, ఈ వివక్ష నన్ను కుంగదీయలేదు. సమాజం నన్ను ఏ కోణంలో చూసి తక్కువ అంచనా వేస్తోందో, అదే కోణాన్ని సవాలు చేస్తూ నేను నిరంతరం ముందుకు సాగుతాను. వారు నన్ను ఎంత తప్పుగా చూపించాలని ప్రయత్నిస్తే, నేను అంతకంటే గట్టిగా శ్రమించి నా ప్రతిభతో వారు అనుకునేది తప్పని నిరూపిస్తూనే ఉంటాను. నా పోరాటం నా ఒక్కదాని కోసమే కాదు, నా లాంటి ప్రతి అమ్మాయి కోసం.
కొత్త పాత్రలు పుట్టాలి
పరిశ్రమలో మహిళల పాత్రల చిత్రణపై నాకు కొన్ని బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. సంప్రదాయ హీరోయిన్ల రూపానికి సరిపోలని మహిళల కోసం బాలీవుడ్‌లో ఇంకా అర్థవంతమైన పాత్రలు రాయడం లేదు. మహిళా నటుల కోసం మెరుగైన పాత్రలను సృష్టించే విషయంలో మన చిత్రపరిశ్రమ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. నేను ప్రస్తుతం చేస్తున్న పోరాటం కూడా అదే. కేవలం ఒక నిర్దిష్టమైన శరీర ఆకృతి ఉన్నవారే హీరోయిన్లు కాగలరనే మూస పద్ధతిని మార్చాలి. ప్రేక్షకులు నన్ను స్ర్కీన్‌పై ఎంత ఎక్కువగా చూస్తే వారి ఆలోచనా విధానం అంతగా విస్తరిస్తుందని నేను నమ్ముతాను. రచయితలు, దర్శకులు నన్ను చూసినప్పుడు, నా శరీరాన్ని మాత్రమే కాకుండా నాలోని నటిని, విభిన్నమైన హావభావాలను ఉపయోగించుకునేలా సరికొత్త పాత్రలను సృష్టించాలనే ఆలోచన వారికి రావాలి. నా రూపం వెనుక ఒక గొప్ప నటి ఉందనే విషయాన్ని వారు గుర్తించినప్పుడే సినిమా రంగంలో అసలైన మార్పు వస్తుంది.
మానసిక సంఘర్షణ
భారీ మల్టీస్టారర్ ‘ధమాల్ 4’లో నటించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చినా, ఆ పాత్రను అంగీకరించేముందు నేను తీవ్ర మైన మానసిక సంఘర్షణ అనుభవించాను. నేను వ్యక్తిగతంగా దేనికైతే వ్యతిరేకంగా నిలబడతానో, సమాజంలో ఏది తప్పు అని భావిస్తానో, అలాంటి ఒక సున్నితమైన, వివాదాస్పదమైన అంశాన్ని ఈ సినిమాలో స్పృశించాల్సి వచ్చింది. అందుకే ఈ పాత్రను అంగీకరించే ముందు నా మనసులో పెద్ద అలజడి రేగింది.
స్వీటూ నుంచి గాయత్రి వరకు...
గతంతో పోలిస్తే మెయిన్‌స్ట్రీమ్ హిందీ సినిమాలో మహిళల పాత్ర చిత్రణలో క్రమంగా మార్పు వస్తోంది. ఒకప్పుడు కాస్త లావుగా ఉండే పాత్రలను కేవలం కామెడీ కోసమే వాడేవారు. ‘కల్ హో నా హో’ లోని స్వీటూ పాత్రను డబుల్ చాక్లెట్ ఫ్రాపుచినో, మఫిన్లు తినే హాస్య పాత్రగా చూపేవారు. అయితే, స్వీటూ పాత్రతో మార్పు మొదలైంది. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో నేను పోషించిన ‘గాయత్రి’ పాత్ర ద్వారా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. గాయత్రి తన పాత్ర బరువు గురించి ఎగతాళి చేసినప్పుడు కుంగిపోలేదు, సమాజానికి ఎదురుతిరిగి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. నేటి సినిమాల్లో మహిళలకు సొంత అస్తిత్వం, ఆలోచనా స్వేచ్ఛ లభిస్తున్నాయి. ఇండస్ట్రీలో మాకు దక్కుతున్న ప్రత్యేక స్థానాన్ని మేము సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం.
వంద దెబ్బలైనా భరిస్తా...
‘ధమాల్ 4’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న ట్రోలింగ్‌ను, నెగటివ్ కామెంట్లను నేను చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇలాంటిదేదో జరుగుతుందని మా చిత్ర బృందం కూడా ఊహించింది. కాబట్టి మేం దీని కోసం మానసికంగా సిద్ధపడే ఉన్నాం. ట్రోలర్లకు మనం ఎంత ఎక్కువ అటెన్షన్ ఇస్తే, వారు అంతగా రెచ్చిపోతారు. వారిని పూర్తిగా విస్మరించడమే దానికి సరైన సమాధానం. ఈ వివాదాల నేపథ్యంలో సహ నటుడు అజయ్ దేవగణ్ లేదా సినిమా దర్శకుడు ఎవరైనా మీకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు పలికారా? అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. నన్ను ఎవరూ ఓదార్చాల్సిన పనిలేదు. ఒకరి మద్దతు కోరి బాధపడుతూ కూర్చునే బలహీనమైన అమ్మాయిని కాను నేను. వంద దెబ్బలు పడినా తట్టుకుని, అంతే ధైర్యంగా నిలబడగల శక్తి ఈ అంజలికి ఉందని మా చిత్రబృందానికి తెలుసు. అందుకే వారు నన్ను చూసి గర్వపడతారు.
అది సామాజిక జాడ్యం
వివక్ష కేవలం అధిక బరువుకే పరిమితం కాలేదు. మనుషుల రూపాన్ని బట్టి జడ్జ్ చేయడం ఒక పెద్ద సామాజిక జాడ్యంగా మారిపోయింది. ఇది నా ఒక్కదాని సమస్య మాత్రమే కాదు. లావుగా ఉన్న వారిని ఎగతాళి చేసినట్టే, మరీ సన్నగా ఉన్న వారిని కూడా అవహేళన చేస్తారు. ఒకరి చర్మ రంగును బట్టి, ఒకరికి తలపై జుట్టు లేకపోవడాన్ని బట్టి, వారు వేసుకునే బట్టలను బట్టి, వాడే బ్రాండ్లను బట్టి.. ఇలా ప్రతి చిన్న విషయానికి సమాజం ఇతరులను తక్కువ చేసి చూస్తూనే ఉంది. ఒక మనిషి అంతరంగాన్ని, వారి వ్యక్తిత్వాన్ని చూడటం మన సమాజం ఎప్పుడో మరిచిపోయింది. సమాజం నుంచి ఈ వివక్ష పూర్తిగా అదృశ్యమయ్యే రోజు బహుశా ఎప్పటికీ రాకపోవచ్చు. అయినప్పటికీ ఒక కళాకారిణిగా ఇలాంటి సామాజిక సమస్యలను సరికొత్త కోణంలో వెండితెరపై ప్రదర్శించడం ద్వారా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నిస్తూనే ఉంటాను.