కవర్ కట్టడి ఏదీ?
ABN , Publish Date - Jun 11 , 2026 | 09:37 AM
ఆధునికత పేరుతో నేటి సమాజం అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. తొలుత ఫ్యాషన్‌గా ప్రారంభమైన కవర్ల వినియోగం, ప్రస్తుతం అది లేనిదే ఏదీ తేలేం అన్నట్లుగా తయారైంది.
ప్లాస్టిక్ కవర్ల వాడకంతో అనారోగ్యం
జిల్లాలో విచ్చలవిడిగా వాడకం
పొంచి ఉన్న రోగాల ముప్పు
చోద్యం చూస్తున్న అధికారులు
పుట్టపర్తి(సత్యసాయి): ఆధునికత పేరుతో నేటి సమాజం అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. తొలుత ఫ్యాషన్‌గా ప్రారంభమైన కవర్ల వినియోగం, ప్రస్తుతం అది లేనిదే ఏదీ తేలేం అన్నట్లుగా తయారైంది. కాయగూరల నుంచి, హోటళ్లలో టిఫిన్లు, భోజనాలు, ఆఖరికి టీ తేవడానికి కూడా కవర్లనే వినియోగిస్తున్నారు. వేడి వేడి పదార్థాలు వేస్తే కవర్లలోని విష రసాయనాలు తినుబండారాల్లో కలిసి మనిషి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ప్రమాదకర రోగాలను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం మరింత ఎక్కువగా ఉంది.
తనిఖీలు ఎక్కడ ?
ప్లాస్టిక్ నిషేధం అమలుపై అధికారులు తరచూ ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు, జరిమానాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతమైన పుట్టపర్తిలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని ఆరికట్టాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు. ప్లాస్టిక్ బదులుగా ఫుడ్ గ్రేడ్ పేపర్ కంటైనర్లు, అరటిఆకులు, దొన్నెలు, బయోడిగ్రేడబుల్ బాక్సులు, స్టీల్ లేదా గాజుపాత్రలు పునర్వినియోగ సంచులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిషేధం అమలు ఎక్కడ..?
సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించినప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలోని అనేక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ, కిరాణా దుకాణాలు, చికెన్, మటన్ సెంటర్లలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా వేడివేడి కర్రీలు, సాంబార్, నూనె పదార్థాలు సైతం పలుచటి ప్లాస్టిక్ కవర్లలోనే చుట్టేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల దీర్ఘకాలంలో జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, కాలేయం, మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
హోటల్ యజమానులు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులు నిషేధిత ప్లాస్టిక్ వాడినా, ఆహారంలో పరిమితికి మించి రంగులు కలిపినా కఠిన చర్యలు తప్పవు. జరిమానా రూ. 5లక్షల వరకు విధించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ వాడటం వలన కలిగే దుష్పరిమాణాలపై, పాఠశాలలు, కళాశాలల నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడటం వలన కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి.
గణేష్, జిల్లా ఆహార భద్రతాధికారి
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News