Share News

ఎక్కడున్నావ్‌ ప్రకాష్‌.. వేట ప్రారంభించిన మూడు బృందాలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:37 PM

పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలెట్టారు.

ఎక్కడున్నావ్‌ ప్రకాష్‌.. వేట ప్రారంభించిన మూడు బృందాలు
Thopudurthi Prakash Reddy

  • ఒకటి కేరళం.. మరో రెండు ఉత్తర భారతదేశానికి..

  • మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులు సిద్ధం

అనంతపురం: పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈమేరకు పలు రాష్ట్రాల్లో పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ నెల 25న పోలీసులను కించపరుస్తూ, పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. ‘తోపుదుర్తి’ వైఖరిని జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను జిల్లా పోలీస్ శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఆయన గతంలో కూడా పలు మార్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. తోపుదుర్తికి చెందిన ఓ యువకుడి హత్య కేసులో ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజాను అరెస్టు చేసినప్పుడు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. పదేపదే పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా ఎన్నికల వేళ ఆయన మరోసారి దారుణంగా పోలీసులను దూషించాడు. రెచ్చగొట్టేలా మాట్లాడటంతో ఆయనపై కేసు పెట్టి, అరెస్టు చేసేందుకు పోలీస్‌ శాఖ సిద్ధమైంది.


మూడు బృందాలు రంగంలోకి..

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ వేట మొదలెట్టింది. ఆయనపై అనంతపురం త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో 4 సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదైంది. ఆయన్ను పట్టుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ 3 ప్రత్యేక బృందాలను నియమించింది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దేశంలో మూడు రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. ఒక బృందం కేరళ రాష్ట్రానికి, మరో రెండు బృందాలు ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలకు వెళ్లినట్లు పోలీస్‌ వర్గాల సమాచారం. అయితే పోలీసులపై తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే ఇప్పటికే పోలీసుల బృందాలు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆయనను అరెస్టు ఖాయం అని స్పష్టమవుతోంది.


కొంపముంచిన నోటిదురుసు

వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోటి దురుసు ఆ పార్టీ శ్రేణులను అయోమయంలో పడేసింది. రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన ఆ పార్టీ అభ్యర్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసు వ్యవస్థపై చేసిన నోటిదురుసు వ్యాఖ్యలే కారణం. ‘ఖాకీ దుస్తులు విప్పేసి.. టీడీపీ గూండాలతో కలిసి రండి... మేము ఖద్దరు వదిలేసి మామూలు దుస్తులు వేసుకున్నాం... రండి... నా కొ....ల్లారా’ అంటూ పరుష పదజాలంతో పోలీసు వ్యవస్థను తూలనాడారు. పోలీసు అధికారుల అడ్‌హాక్‌ కమిటీ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే.


vv.jpgతోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో ప్రకాష్ రెడ్డి పరారయ్యారు. ఆయన నోటిదరుసు వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి పోలీసు వ్యవస్థను కించపరిచేలా ఎలా మాట్లాడతారనే చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. పార్టీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇదంతా ఒక ఎత్తైతే.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి... పోలీసు వ్యవస్థపై చేసిన నోటిదురుసు వ్యాఖ్యలు పోటీలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడంలో సందేహం లేదు.


ఎన్నికల వేళ అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న క్లిష్టపరిస్థితుల్లో అభ్యర్థులకు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా నిలవాల్సిన నాయకుడు నోటిదురుసుతో దూరం కావడం ఆ పార్టీ అభ్యర్థులకు శాపంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందేలా తోపుదుర్తి వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల్లో అలజడి రేగుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో అదే పోలీసు వ్యవస్థనే పనిచేసింది. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప.. పోలీసు వ్యవస్థ మారలేదనే విషయాన్ని మరిచి, తూలనాడటం మంచిది కాదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏదిఏమైనా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోటి దురుసు వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిరాశలోకి నెట్టాయనే చెప్పాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన

చూసినా.. షేర్ చేసినా.. కటకటాలపాలే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 01:37 PM