రైళ్లలో రాత్రి 11 నుంచి ఛార్జింగ్ బంద్.. రైల్వే బోర్డు కీలక ఆదేశాలు!
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:49 PM
రైలు ప్రయాణికులకు కీలక సూచన! రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలో మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంక్‌ల ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 28: రైళ్లలో రాత్రివేళ మొబైల్, పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌ల వల్ల జరిగే అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైలు బోగీల్లో ఉన్న ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని ('నైట్ ఛార్జింగ్ బాన్') రైల్వే బోర్డు అన్ని జోన్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వులకు కారణం
సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో ఓ లోకల్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెట్టగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రైలు బోగీ అంతా దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, అక్టోబర్ 26న రాసిన లేఖలో రాత్రివేళ విద్యుత్ నిలిపివేత నిబంధనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని, సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించింది.
ఆకస్మిక తనిఖీలు
రాత్రి 11:00 నుంచి ఉదయం 5:00 గంటల మధ్య మెయిన్ స్విచ్ బోర్డుల నుంచి ఛార్జింగ్ పాయింట్లకు కరెంట్ నిలిపివేస్తున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు అధికారులతో ఆకస్మిక రైడ్‌లు నిర్వహించాలని బోర్డు సూచించింది. ఈ నిబంధన అమలులో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఉష్ణోగ్రతలు పెరగడం, ఓవర్‌లోడింగ్, షార్ట్ సర్క్యూట్‌ల వల్ల మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి ఈ నిబంధనను మొదటగా 2014 జూన్ 19న (బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత) ప్రవేశపెట్టారు. మార్చి 2021లో కూడా ఈ ఆదేశాలను రైల్వే బోర్డు పునరుద్ధరించింది.
ప్రయాణికులకు సూచన
రాత్రి వేళల్లో (11 PM - 5 AM) రైళ్లలో స్విచ్‌బోర్డులు పనిచేయవు కాబట్టి, ప్రయాణానికి ముందే మొబైల్‌ఫోన్లు, పవర్ బ్యాంక్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.(Train Mobile Charging Ban)
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Read Latest AP News And Telugu News