పూత, కాత.. పురుగుకు మేత
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:51 PM
కాయ తొలుచు పురుగు ఉధృతం కావడంతో కంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
కందిలో కాయతొలుచు పురుగు ఉధృతి
నష్టపోతామని రైతుల ఆందోళన
మండలంలో 3,800 ఎకరాల్లో కంది సాగు
యాడికి(అనంతపురం): కాయ తొలుచు పురుగు ఉధృతం కావడంతో కంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, కాయలు ఏర్పడే దశలో ఆశించే ఈ కాయ తొలుచు పురుగు వల్ల పంటకు తీవ్రనష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 3800ఎకరాల్లో కందిపంటను సాగు చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో వేరుశనగ, పత్తి తదితర పంటలను బాగా నష్టపోయిన రైతులు కందిపంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కంది పూత, కాయలు ఏర్పడే దశలో ఉంది. ప్రారంభంలోనే కందిపంటను కాయ తొలుచు పురుగు ఆశించడంతో రైతులు పురుగు నివారణకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
కాయతొలుచు పురుగు లక్షణాలు
కందిమొక్కల ఆకులు, పూలు దెబ్బతినడం, లేతకాయలపై రంధ్రాలు కనిపిస్తాయి. కాయలు ఎండిపోవడం, గింజల నాణ్యత తగ్గడం, మొక్కలపై ఆకుపచ్చ రంగులో ఉండే లార్వాలు కనిపిస్తాయి. కాయ తొలుచు పురుగు మొదట ఆకులు, పూత, మొగ్గలను ఆశించి నష్టం కలిగిస్తుంది. అనంతరం కాయలు ఏర్పడే సమయంలో కాయలకు రంధ్రాలుచేసి లోపల ఉన్న గింజలను తింటుంది. దీంతో కాయలు దెబ్బతినడం, గింజలు సరిగా వృద్ధి చెందకపోవడంతో దిగుబడి తగ్గుతుంది.
నివారణ చర్యలు తప్పనిసరి
కంది రైతులు తమ పొలాలను తరచూ పరిశీలిస్తూ పురుగు గుడ్లు, చిన్నలార్వాలను గుర్తించి నాశనం చేయాలి. ఎకరాకు సుమారు 20ఫెరోమాన్ ఉచ్చులు ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని గమనించాలి. పురుగులను తినేందుకు ఎకరాకు 20పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. వేప ఆధారిత మందులు, జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వ్యవసాయశాఖ సిఫారసుల మేరకు ఎమామెక్టిన్ బెంజోయెట్ 5ఎస్‌జీ లేదా స్పైనోసాడ్ 45 ఎస్‌సి వంటి పురుగు మందులను లేబుల్ సూచనల ప్రకారం ఉపయోగించాలి. కాయతొలుచు పురుగు నివారణకు ఇండోక్సాకార్బ్-1 ఎంఎల్, కోరాజెన్- 0.4ఎంఎల్, ఫెన్యురాన్-1.2ఎంఎల్, డెల్టామెత్రిన్-1ఎంఎల్ వీటిలో ఏదో ఒక రకం మందును లీటరు నీటికి కలిపి సూచించిన మోతాదులో పిచికారీ చేయాలి. ఒకే మందును పదేపదే వాడకుండా మందుల మార్పిడిని పాటించాలి. కందిపంటలో కాయతొలుచు పురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలే కీలకం. పురుగు ఉధృతి పెరిగిన తర్వాత మందులు పిచికారీ చేయడం కంటే ప్రారంభదశలోనే గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం మేలు.
ఉధృతి ఎక్కువగా ఉంది
నాలుగు ఎకరాల్లో కందిపంట సాగుచేశా. ప్రస్తుతం పూత ఎక్కువగా వచ్చి, కాయలు ఏర్పడే దశలో ఉంది. కందికాయలకు అప్పుడే కాయతొలుచు పురుగు పడుతోంది. దీంతో పంట దిగుబడిపై భయం కలుగుతోంది. పురుగు దెబ్బతో పూత, లేతకాయలు దెబ్బతింటున్నాయి. కందికాయలకు చిన్నరంధ్రాలు చేసి పురుగు లోపలకు వెళ్లి కాయమొత్తం తినేస్తుంది. మందులు వాడినా పురుగు ఉధృతి తగ్గడం లేదు.
ఓబులపతి, రైతు, కుందనకోట గ్రామం
సూచించిన మందులే వాడాలి
కందిపంటను ఎక్కువగా ఆశించే పురుగుల్లో కాయ తొలుచు పురుగు ప్రధానమైంది. కందిపంట పూత, కాయ దశలోనే ఈ పురుగు ప్రభావం చూపుతుంది. కాయతొలుచు పురుగును ప్రారంభదశలోనే నివారించడం సులభం. పురుగు ఉధృతి ఎక్కువైతే దీని ప్రభావం పంట దిగుబడిపై పడుతుంది. కాయతొలుచు పురుగు నివారణకు రైతులు వ్యవసాయ సిబ్బంది సూచించిన మందులను పిచికారీ చేయాలి.
మహబూబ్‌బాషా, ఏవో, యాడికి మండలం
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News