Share News

ప్రకృతి వ్యవసాయంవైపు రైతుల అడుగులు

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:48 PM

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభాలు సాధించే వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు అడుగులు వేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంవైపు రైతుల అడుగులు
Natural Farming, Ananthapuram

  • ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ అధికారులు

  • శిక్షణ ఇస్తున్న జడ్పీఎన్‌ఎస్‌ సంస్థ

సోమందేపల్లి(అనంతపురం): తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభాలు సాధించే వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పీఎండీఎస్(ప్రీమాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌) విధానంలో పంటల సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్‌డ్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ రకాల పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు సాగుచేస్తున్నారు. ఏకకాలంలో వివిధ రకాల పంటలసాగును చేపడుతుండటంతో ఏడాది పొడవునా అధిక దిగుబడులు సాధించి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రతి రైతు ఈ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. సోమందేపల్లి మండల వ్యాప్తంగా 500ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోంది.


vv.jpgనవధాన్యాలతో పంటల సాగు

పీఎండీఎస్‌ పద్ధతుల్లో నవధాన్యాలను రైతులు సాగు చేస్తున్నారు. వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా భూమిలో తేమశాతం సంరక్షించడంతోపాటు 15రకాల మొండి జాతి తీగలు, మొక్కలు పెంచుతున్నారు. బయోడైవర్సిటీ మొక్కల కింద 20రకాల విత్తులను భూమిలో చల్లడంతో భూమి పచ్చగా ఉంటూ పొడి వాతావరణంలో సైతం పంటలు అధిక దిగుబడలు వచ్చేలా చేస్తుంది. జొన్నలు, సజ్జలు, అలసందలు, పెసలు, ఇనుములు, ఆముదం, అనుపలు, తదితర విత్తనాలు చల్లి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేయడం రైతులకు కలిసి వస్తోంది.


జడ్పీఎన్‌ఎస్ ఆధ్వర్యంలో శిక్షణ

మండల రైతులకు వ్యవసాయాధికారి విజయభారతి, జడ్పీఎన్‌ఎస్ శిక్షకులు మల్లికార్జున బృందం ప్రకృతి వ్యవసాయాన్ని ఏవిధంగా చేపట్టాలో నేర్పిస్తున్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో పీఎండీఎస్‌ విధానాన్ని, పొలంలోనే విత్తన శుద్ధిచేసే విధానం, నవధాన్యాలు వేసుకునే పద్ధతి, ఘన, జీవామృత తయారీపై రైతులకు లైవ్‌ డెమో ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జిల్లా యంత్రాంగం కృషిచేస్తుంది.


vvv.jpgజీవ రసాయనాల తయారీ

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా జీవరసాయనం ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. జీవామృతం, బీజామృతాన్ని ఎలా తయారుచేసుకోవాలో జెడ్‌బీఎన్‌ఎఫ్ శిక్షకులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచడం ద్వారా పేడ, పశవువుల మూత్రం, శనగపిండి, బెల్లం మిశ్రమంలో నీటిని కలిపి జీవామృతాన్ని తయారుచేసి పంటలకు వేస్తున్నారు. విత్తనశుద్ధి కోసం దేశీ ఆవుపేడ మూత్రం, సున్నం కలిపి బీజామృతాన్ని తయారుచేసి విత్తన గుళికలను తయారు చేసుకుని పంటలు ఆరోగ్యంగా పెరిగేలా చూస్తున్నారు. తెగుళ్లు, పురుగులు, పంటలను ఆశించకుండా వేపకషాయం, అజ్ఞాస్త్రం తదితర వాటిని ఉపయోగిస్తున్నారు.


30 ఎకరాల్లో సాగు

నాకున్న 30ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పీఎండీఎస్‌ విధానంలో వివిధ పంటలు సాగు చేస్తున్నా. అధికారుల సలహాలు, సూచనలతో నవధాన్యాలను భూమిలో చల్లి వివిధరకాల పంటల సాగును ఏకకాలంలో చేపట్టా. జీవామృతం, ఘనామృతం ఉపయోగిస్తూ తక్కువ నీటితో చేపట్టిన పంటల సాగు ఆశాజనకంగా ఉంది. ప్రతి రైతు ఈ పద్ధతి పాటిస్తే, పెట్టుబడి తగ్గడంతో నష్టపోయే అవకాశం తగ్గుతుంది.

  • రంగప్ప, గుడిపల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 01:48 PM