Share News

రూ.17వేల కోట్లతో కియా ప్లాంట్ విస్తరణ... మంత్రి సవిత హర్షం

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:05 PM

కియా ప్లాంట్ విస్తరణ ఒప్పందంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో సీఐఐ సదస్సు - 2026 ఘనంగా జరుగుతోందని.. తొలిరోజే రూ.5.85 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు.

రూ.17వేల కోట్లతో కియా ప్లాంట్ విస్తరణ... మంత్రి సవిత హర్షం
Minister Savitha

శ్రీసత్యసాయి జిల్లా, నవంబర్ 13: కియా ప్లాంట్ విస్తరణ ఒప్పందంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విశాఖ సీఐఐ సదస్సు - 2026 ఘనంగా జరుగుతోందని.. తొలిరోజే రూ.5.85 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. ఈరోజు కూడా భారీ సంఖ్యలో ఒప్పందాలు చేసుకోడానికి పలు కంపెనీలు, వాటి ప్రతినిధులు ఆసక్తితో ఉన్నారని తెలిపారు. రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల టార్గెట్‌ను సులభంగా అధిగమిస్తామని చెప్పుకొచ్చారు. సీబీఎన్... అనే బ్రాండ్‌తోనే ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.


దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని మంత్రి అన్నారు. ఇదీ కూటమి ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ప్రతీకగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కియా యాజమాన్యం పెనుకొండలోని తమ ప్లాంట్ విస్తరణకు ముందుకు రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంపై కియా యాజమాన్యానికి పెరిగిన నమ్మకానికి నిదర్శనం ఈ ఒప్పందమని తెలిపారు. కియా ప్లాంట్ విస్తరణకు రూ.17 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. ఈ ప్లాంట్ విస్తరణ ద్వారా కొత్తగా 12 వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఏటా 2 లక్షల కార్లను కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.


2030 నుంచి రెండో ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మొదటి ప్లాంట్‌ను కియా యాజమాన్యం ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఆ ప్లాంట్‌లో 13 వేల మందికి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. పాత ప్లాంట్‌లో ఏటా 4.30 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పెనుకొండలో తయారైన కార్లను దేశ, విదేశాలకు ఎగుమతి చేశారన్నారు. ప్లాంట్ విస్తరణతో ఏపీలో కియా యాజమాన్యం 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోందని అన్నారు. కియా ప్లాంట్ విస్తరణతో ఏడాదికి 6.30 లక్షల కార్లను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. కియా రాకతో ప్రపంచం చూపు పెనుకొండ, ఏపీపై పడిందన్నారు. కియా పరిశ్రమ ఏర్పాటుతో పెనుకొండ రూపురేఖలే మారిపోయాయన్నారు. కియా అందజేసే సీఎస్ఆర్ ఫండ్స్‌తో పెనుకొండ పట్టణం సహా చుట్టపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వీలు కలిగిందని మంత్రి సవిత వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి మరో రూ.700 కోట్ల పెట్టుబడులు.. 2,300 మందికి డిక్సన్‌లో ఉద్యోగాలు

ఏపీకి రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు..10,919 మందికి ఉద్యోగాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 04:12 PM