ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు..!
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:46 PM
ప్రభుత్వం మంచిదైతే.. ప్రజా ప్రతినిధీ మంచివారైతే ప్రజలకు జరిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ.
పార్కుగా మారిన చెత్త సంపద కేంద్రం
మొక్కలు నాటి.. వర్మీ ఎరువుతో పెంపకం
పిల్లలకు ఆట స్థలం.. పెద్దలకు వాకింగ్ ట్రాక్
ఆదర్శంగా నిలుస్తున్న తూముచెర్ల పంచాయతీ
ప్రభుత్వం మంచిదైతే.. ప్రజా ప్రతినిధీ మంచివారైతే ప్రజలకు జరిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ. చెత్త నుంచి సంపదను సృష్టించడం అంటే.. ఎరువును తయారు చేసి, దాన్ని విక్రయించడం..! కానీ తూముచెర్లలో అంతకు మించిన సంపదను సృష్టించారు. వైసీపీ పాలనలో మందుబాబులకు అడ్డాగా మారిన చెత్తసంపద కేంద్రం నేడు సుందర వనంగా మారిపోయింది. ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది.
- ఆంధ్రజ్యోతి, కనగానపల్లి(అనంతపురం)
ప్రభుత్వం మారగానే..
2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అవగానే తూముచెర్ల సర్పంచ్ రేణుక, పంచాయతీ కార్యదర్శి రమణ, స్థానిక టీడీపీ నాయకులు చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పునరుద్ధరించారు. రూ.5 లక్షలు వెచ్చించి వర్మీ కంపోస్టు తయారీ సామగ్రిని ఏర్పాటు చేశారు. అన్ని వసతులు కల్పించారు. పారిశుధ్య కార్మికులు గ్రామంలో ఇంటింటా చెత్తను సేకరించి, వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఆ ఎరువును అక్కడే ఉన్న వక్క, కొబ్బరి మొక్కలకు వాడుతున్నారు.
ఆదర్శ గ్రామంగా..
తూముచెర్లకు ఫ్యాక్షన్ గ్రామంగా ముద్రపడింది. అటువంటి మరకను తొలగించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నిరకాల సహాయ సహకారలను అందించి అండగా నిలిచారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నాం.
- యాతం పోతలయ్య, టీడీపీ మండల కన్వీనర్
మారిపోయింది..
చెత్తతో సంపద తయారీ కేంద్రంపై సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆవరణలో దాదాపు 750 వక్క, కొబ్బరి, పూలమొక్కలు నాటి, పార్కులాగా మార్చారు. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.
మొక్కలకు వాడుతున్నాం..
నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించాము. ప్రభుత్వం మారడంతో నిరుపయోగంగా వదిలేశారు. మంచి రోజులు వచ్చేదాకా వేచి చూశాము. ప్రభుత్వం మారగానే మా ఆలోచనను ఆచరణలో పెట్టాము. ఉద్యానవనం తరహాలో అభివృద్ధి చేశాము. చాలా సంతోషంగా ఉంది.
- బంగి మల్లేష్, మాజీ సర్పంచ్

మొక్కలకు వాడుతున్నాం..
చెత్త సంపద కేంద్రంలో తయారైన వర్మీ కంపోస్టును ఇక్కడే నాటిన మొక్కలకు వాడుతున్నాం. ఇప్పటి వరకూ 155 బ్యాగుల వర్మీకంపోస్టు (30 కేజీలవి) తయారైంది. 75 రోజులకు ఒకసారి ఎరువును తయారు అవుతోంది.
- బంగి రేణుక, తాజా మాజీ సర్పంచ్
వైసీపీ హయాంలో అధ్వానం..
చెత్త నుంచి సంపద సృష్టించి, ఆ ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించాలని సీఎం చంద్రబాబు ఆలోచన. తూముచెర్ల పంచాయతీ ఆయన చూపిన మార్గంలో నడుస్తోంది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా, తూముచెర్లలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే, నిర్వహణను గాలికి వదిలేసింది. ఇదే అదనుగా మందుబాబులు తమ అడ్డాగా మార్చుకున్నారు.
అన్ని వసతులు కల్పిస్తాం..
పంచాయతీలో ప్రతి రోజూ సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రంలో వర్మీ ఎరువుగా తయారు చేస్తున్నాం. రోజూ ఆరు రిక్షాలతో చెత్తను సేకరిస్తున్నాం. చెత్త సంపద కేంద్రం ఆవరణలో పిల్లలకు ఆటస్థలం, పెద్దలు నడవడానికి వాకింగ్ ట్రాక్, విద్యార్థులు చదువుకోవడానికి వసతులు కల్పిస్తున్నాం.
- రమణ, పంచాయతీ కార్యదర్శి, తూముచెర్ల
ప్రజల్లో మార్పు వస్తోంది
చెత్తతో సంపద తయారీ కేంద్రం అంటే మొదట్లో ఒక రకమైన భావన ఉండేది. ప్రస్తుతం ఆ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడంతో ప్రజల్లో మార్పు వస్తోంది. పెద్దలు, వృద్ధులు సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
- యాతం మల్లికార్జున, తూముచెర్ల
ఈ వార్తలు కూడా చదవండి:
గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News