రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:19 PM
బీఆర్‌ఎస్‌లో చేరికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 9: రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని.. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఏప్రిల్ 13న జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ ఈరోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. జీవన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పని చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు
భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా
Read Latest Telangana News And Telugu News