ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:26 AM
గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరు, ఏప్రిల్ 9: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి యత్నించిన ఘటనలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అవగా.. తాజాగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై(Ambati Rambabu) పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి ఆఫీసు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేశారంటూ గుంటూరులోని అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రిపై కేసు నమోదు అయ్యింది. అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు వ్యతిరేకంగా నిన్న(బుధవారం) వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి రాంబాబు, వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ, అడ్డుకోబోయిన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అంబటి రాంబాబు, వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేసిన అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్, అంబటి మురళి సహా పలువురు నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News