Share News

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:38 AM

ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత న్యాయవ్యవస్థపై విదేశీ కోర్టు వ్యాఖ్యలు - వలసవాద ధోరణిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
Andhra Pradesh High Court UK court remarks

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 9: ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కుమార్తెను.. భార్య అక్రమంగా నిర్బంధించిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో బ్రిటన్‌లోని ఫ్యామిలీ కోర్టు కూడా ఈ కేసులో కొన్ని వ్యాఖ్యలు చేసింది. భారత న్యాయస్థానాలు శిశు సంరక్షణ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తాయని, ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడింది. యూకే కోర్టు చేసిన ఈ విమర్శలపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహినకుమార్ గెద్దెలతో కూడిన ఏపీ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. 'ఇది వలసవాద మనస్తత్వమే!'నని పేర్కొంటూ బ్రిటన్ కోర్టు వాడిన భాషను తప్పుపట్టింది. ప్రస్తుతం.. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


వివాదం నేపథ్యం:

ఈ కేసు ఒక ఎన్ఆర్ఐ(NRI) దంపతులకు సంబంధించినది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బ్రిటన్‌లో స్థిరపడగా, తల్లి తన మైనర్ కుమార్తెతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. ఏ అనుమతి లేకుండా తన భార్య కూతుర్ని తీసుకెళ్లిందని.. ఇది 'పిల్లల అపహరణ' కిందకు వస్తుందని ఆయన బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ తన కూతుర్ని యూకేకు తీసుకురావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే, భారత కోర్టులు ఇలాంటి అంతర్జాతీయ వివాదాల్లో త్వరగా స్పందించవని లేదా పాత పద్ధతులను అనుసరిస్తాయనే అర్థం వచ్చేలా కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టులో హెబియస్ కార్పస్:

యూకే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, తన కుమార్తెను అప్పగించాలని కోరుతూ ఆ వ్యక్తి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్(Habeas Corpus) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. భారతీయ చట్టాల ప్రకారం, విదేశీ కోర్టుల ఆదేశాల కంటే పిల్లల శ్రేయస్సే అత్యున్నతమైనదని స్పష్టం చేసింది. ప్రస్తుతం.. కూతురు తల్లి వద్ద సురక్షితంగా ఉందని, అది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదని అభిప్రాయపడింది. భారత న్యాయ వ్యవస్థపై బ్రిటన్ కోర్టు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అవి మన సార్వభౌమాధికారాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని తీవ్రంగా పరిగణిస్తూ.. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో విదేశీ న్యాయస్థానాలు ఇచ్చే ప్రతి ఆదేశం భారతదేశంలో నేరుగా అమలుకాదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.


ఇవీ చదవండి:

ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

Updated Date - Apr 09 , 2026 | 11:28 AM