రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:47 PM
బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.
బాపట్ల జిల్లా, ఏప్రిల్ 9: బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) ఉదయం భట్టిప్రోలు మండలం సూరేపల్లి చేరుకున్న సీఎం... అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. ప్రభుత్వ స్టాళ్లను సందర్శించారు. ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పార్థసారథి, ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలు: నక్కా ఆనందబాబు
అమరావతి గెజిట్ వచ్చాక సీఎం మొదటి పర్యటనగా బాపట్లకు వచ్చారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆగిన అభివృద్ధి ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిందన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఉద్యాన పంటలు పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మూత పడిన జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని.. ఈ ప్రాంతంలోని కాలువలు ఆధునీకరించాలని సీఎంను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు.
చంద్రబాబు వల్లే అమరావతి నిలబడింది: బాపట్ల ఎంపీ
తాను లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా ఉన్నప్పుడు అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిందని బాపట్ల ఎంపీ టి.కృష్ణ ప్రసాద్ అన్నారు. అన్ని పార్టీలు అమరావతి జై అంటే ఒక్క పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని తెలిపారు. వైసీపీ అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి బాయ్‌కాట్ చేసిందని విమర్శించారు. జగన్ వల్ల రాష్ట్ర అభివృద్ధి పాతికేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు వల్లే మళ్లీ అమరావతి నిలబడిందని ఎంపీ తెలిపారు. జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘మీ భూమి - మీ హక్కు’ పేరిట రక్షణ కల్పించిందని ఎంపీ కృష్ణప్రసాద్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు
ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News