రయ్.. రయ్.. హైవేలో బైక్ విన్యాసాలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:31 PM
బాలురు, యువకులు ఖరీదైన బైక్‌లపై శరవేగంగా దూసుకొస్తారు. ఉన్నఫలంగా వీలింగ్ చేస్తారు.
పేట్రేగిపోతున్న రేసర్లు
ఆ రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్న వాహనదారులు
నిఘా కరువు
పట్టుబడిన వారిపై తూతూమంత్రంగా చర్యలు
కదిరి(అనంతపురం): బాలురు, యువకులు ఖరీదైన బైక్‌లపై శరవేగంగా దూసుకొస్తారు. ఉన్నఫలంగా వీలింగ్ చేస్తారు. చేతులు విడిచి, నడుపుతారు. వాటిని చూసినవారు వణికిపోతున్నారు. ఎక్కడ ప్రమాదాల బారిన పడతారోనని ఆందోళన చెందుతున్నారు. బైక్ రేసర్లు పట్టణ పరిధిలో రహదారులపై పేట్రేగిపోతున్నా.. కట్టడి చేసేవారు కరువయ్యారు. పట్టుబడిన వారిపైనా పోలీసులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రేసర్లు నిత్యం విన్యాసాలు చేస్తుండగా.. ఆ రహదారుల్లో వెళ్లేవారు వణికిపోతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా కరువైంది.
నిత్యం విన్యాసాలు
కదిరి నుంచి మదనపల్లి రోడ్డుకు వెళ్లే హైవే, నూతనంగా నిర్మించిన బైపాస్‌లో నిరంతరం బైక్ విన్యాసాలు చేస్తున్నారు. వారి వయసు 16 నుంచి 25 ఏళ్లలోపే ఉంటుంది. ఖరీదైన ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. అందులో మరొకరు కూడా ఉంటారు. రేసింగ్‌లు ఆడుతున్నారు. అధిక వేగంతో వెళ్తూ ఒక్కసారిగా ముందు చక్రాన్ని గాలిలో లేపుతారు. హైవేలో నిరంతరం బైక్ స్టంట్లు చేస్తూనే ఉంటారు.
హడలిపోతున్న వాహనదారులు
కదిరి పట్టణంలో నుంచి మదనపల్లి రోడ్డు వైపునకు రేసర్లు సాయంత్రం వేళల్లో వెళ్తారు. నానా దర్గా దగ్గరమొదలవుతుంది. అక్కడి నుంచి రేసర్లు వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒకచోట ముందుచక్రాన్ని గాలిలోకి లేపుతారు. అదే సమయంలో పక్కనే ఇతర వాహనాలు వెళ్తుంటాయి. వాటిలోని వారు ఎక్కడ తమ వాహనాలను ఢీకొంటారోనని భయంతో వణికిపోతున్నారు. ఇలా పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. కొత్త బైపా్‌సలో స్టంట్లకు అడ్డేలేదు. హిందూపురం రోడ్డు నుంచి అనంతపురం వెళ్లే రహదారి వరకు ప్రారంభం కాలేదు. రోడ్డు మొత్తం పూర్తయింది. ఈరోడ్డు నుంచి అనంతపురం, పులివెందుల వైపు వాహనాలు వెళ్తుంటాయి. ట్రాఫిక్ తక్కువగా ఉంటే ఈ రోడ్డు రేసర్లకు అనువుగా ఉంది. దీంతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. ఉన్నట్లుండి వాహనాలు వస్తే వాటిని తప్పించబోయి, ఎదురుగా వచ్చే వాటిని ఢీకొడుతున్నారు. కొన్నిమార్లు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు రేసర్ల విన్యాసాలతో భయపడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటేనే..
బైక్ రేసర్లను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. నానా దర్గా నుంచి కౌలేపల్లి వరకు సీసీ కెమెరాలున్నాయి. హిందూపురం రోడ్డులో కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్లపై నిత్యం బైక్ రైడర్లు రేసింగ్ నిర్వహిస్తున్నా.. కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. నిఘా కరువైంది. మీడియాలో వచ్చిన రెండురోజులు హడావుడి చేసి.. తరువాత గాలికొదిలేస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు. ఇటీవల కొంతమంది బైక్ రేసర్లను పోలీసులు గుర్తించారు. 25మందికిపైగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. కొంతమందిపై బైండోవర్ కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో రేసర్లకు భయంలేకుండా పోతోంది. కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటివి జరగకుండా ఆపవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబిస్తుండడం శోచనీయం.
తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం
బైక్ రేసర్లు ఖరీదైన ద్విచక్రవాహనాలను వాడుతున్నారు. ఇంత ఖరీదైన వాహనాలను తల్లిదండ్రులు ఎందుకిస్తున్నారో అర్థం కావడంలేదని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఈ వాహనాల్లో రేసింగ్ చేస్తుంటే తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారని వాపోతున్నారు. వీరిని నివారించాల్సిన తల్లిదండ్రులే వాహనాలు కొని ఇస్తుండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రేసింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం
పట్టణంలో బైక్ రేసింగ్ జరుగుతున్నట్లు గుర్తించాం. ఇప్పటికే కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. తదుపరి చర్యగా కేసులు పెడతాం. వాహనాలు సీజ్ చేస్తాం. బైకర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. బైక్ రేసింగ్‌ను పూర్తిగా కట్టడి చేస్తాం.
శివనారాయణ, డీఎస్పీ, కదిరి
ఈ వార్తలు కూడా చదవండి:
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్
కాంగోలో అలజడి సృష్టిస్తున్న ఎబోలా.. 101 చేరిన మృతుల సంఖ్య..
Read Latest AP News And Telangana News And International News And Telugu News