Share News

కాంగోలో అలజడి సృష్టిస్తున్న ఎబోలా.. 101 చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:09 PM

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఎబోలా అలజడి సృష్టిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఎబోలా కేసుల సంఖ్య 550కి చేరింది. వీరిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాంగోలో అలజడి సృష్టిస్తున్న ఎబోలా.. 101 చేరిన మృతుల సంఖ్య..
Ebola outbreak Congo

ఇంటర్‌నెట్ డెస్క్: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఎబోలా అలజడి సృష్టిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఎబోలా కేసుల సంఖ్య 550కి చేరింది. వీరిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్యాధికారులు సోమవారం విడుదల చేసిన వివరాల మేరకు.. ఆదివారం రోజున ఇటూరి, నార్త్ కివు ప్రాంతాల్లో కొత్తగా 35 ఎబోలా కేసులు నమోదు అయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 మంది ఎబోలా నుంచి కోలుకున్నారు. 309 మంది ఐసోలేషన్ లేదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


కాగా, కాంగోతో పాటు ఉగాండా దేశంలో ‘బుండిబుగ్యో’ ఎబోలా వైరస్ రకం తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కాంగో సరిహద్దుల నుంచి వచ్చిన వారి ద్వారా ఉగాండాలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఉగాండాలో 19 కేసులు నిర్థారణ అయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుండిబుగ్యో ఎబోలా రకానికి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. సరైన మందులు లేకపోవటం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎబోలా సోకిన వారికి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్స్, జ్వరం టాబ్లెట్స్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.


త్వరలో అందుబాటులోకి రష్యా వ్యాక్సిన్..

‘బుండిబుగ్యో’ను కట్టడి చేసేందుకు కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. కాంగోలో వ్యాపిస్తున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్‌ నుంచి ఈ వ్యాక్సిన్‌ రక్షణ కల్పించగలదని రష్యా తెలిపింది. ‘బుండిబుగ్యో’ను నిరోధించేందు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ సమయంలో రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఎంతో కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్

Updated Date - Jun 09 , 2026 | 01:15 PM