Share News

రాయలసీమ ఒకప్పుడు డ్రాట్ జోన్‌.. ఇప్పుడు గ్రోత్ జోన్‌: చంద్రబాబు

ABN , Publish Date - May 15 , 2026 | 01:23 PM

ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.

రాయలసీమ ఒకప్పుడు డ్రాట్ జోన్‌.. ఇప్పుడు గ్రోత్ జోన్‌: చంద్రబాబు
CM Chandrababu

శ్రీసత్యసాయి జిల్లా, మే 15: పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు(శుక్రవారం) పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడిందని తెలిపారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.


ఓర్వకల్లులో డ్రోన్ సిటీ..

భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటడంలో ఆపరేషన్ సిందూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని సీఎం తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారు చేసి పరీక్షించారని చెప్పారు. AMCA ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్‌తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి చెందుతుందన్నారు. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగామని.. జెట్ స్పీడ్‌తో అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ఈ కీలక ప్రాజెక్టుతో మరిన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఫోర్జ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌తో కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


2028 నాటికి కడప స్టీల్‌ప్లాంట్ పూర్తి..

శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా ఏపీ దేశానికి అండగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాయలసీమ ఒకప్పుడు డ్రాట్ జోన్‌ అని.. ఇప్పుడు గ్రోత్ జోన్‌‌గా మారిందన్నారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ గుర్తొచ్చేదని.. ఇకపై (JGF) జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌ అని చెప్పుకుంటారని తెలిపారు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌లో 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌లో 1,500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తామన్నారు. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ నిలవనుందని చెప్పుకొచ్చారు. కడప స్టీల్‌ ప్లాంట్ పనులను జూన్‌లో ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028 నాటికి కడప స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిచేస్తామన్నారు. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు కూటమి ప్రభుత్వం రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2026 | 01:40 PM