Share News

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

ABN , Publish Date - May 15 , 2026 | 12:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్
Nara Lokesh On AMCA

శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో ఏర్పాటయ్యే ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ - AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చబోతుంది. డిఫెన్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు.


అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 'భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పవిత్ర భూమి ఈరోజు భారతదేశ రక్షణరంగ కొత్త శక్తి కేంద్రంగా మారుతోంది. ఉమ్మడి అనంతపురం, గత ఎన్నికల్లో ఎన్‌డీఏకి కంచుకోట. పోటీ చేసిన 14 సీట్లను క్లీన్ స్వీప్ చేశారు. అందుకే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్.. కరువు నేలపై కార్లు పరిగెత్తించిన మన విజనరీ ముఖ్యమంత్రి సీబీఎన్. ఇప్పుడు అదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్స్ ఎగిరేలా చేస్తున్నది కూడా మన ముఖ్యమంత్రి సీబీఎన్. ఈ నేలకు భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు ఉన్నాయి. ఎవరూ ఉహించని సమయంలో ఆయన ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఫైటర్ జెట్స్ తయారు చేసే పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి'.

స్పీడ్ తట్టుకోలేం

'ఆపరేషన్ సిందూర్‌కు ఒక సంవత్సరం పూర్తి అయింది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇచ్చిన ఘటన అది.. దానికి ప్రతి భారతీయుడూ గర్వపడాలి. ఆపరేషన్ సిందూర్ వెనుక అతిపెద్ద శక్తి, మన ఐరన్ మ్యాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రమే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. మోదీ, మన చంద్రబాబు స్పీడ్ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు'.


రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

'రాష్ట్రానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు వల్లే భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో దేశానికి చూపించాం. ఆంధ్రప్రదేశ్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్ డెస్టినీగా మార్చాం. ఇతర రాష్ట్రాల అభివృద్ధి చూసి మనం అసూయ పడే రోజులు పోయాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు మన అభివృద్ధి చూసి అసూయ పడే రోజులు వచ్చాయి'.

ఏఎంసీఏతో యువతకు ఉద్యోగాలు

'జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్, పుట్టపర్తిలో ఏఎంసీఏ, డిఫెన్స్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కలిసి AMCA ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) దశాబ్దాలుగా బెంగళూరును అభివృద్ధి చేసింది. అదే తరహాలో AMCA పుట్టపర్తిని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్‌తో పాటు అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల ఈ ప్రాంత యువతకు పెద్దఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా మనం డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఒక్క కియాతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఎంసీఏతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో నెంబర్ 1 కావడం ఖాయం'.


సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి

'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కృషిచేశారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే ఇవాళ పుట్టపర్తి భారత డిఫెన్స్ మ్యాప్‌పై కొత్త గుర్తింపు పొందుతోంది. లక్ష కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్, వేలాది యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ కాదు...ఇది రాయలసీమ భవిష్యత్తుకు కొత్త దిశ ఇచ్చే ప్రాజెక్ట్. ఇవాళ పుట్టపర్తి కేవలం ఒక ఆధ్యాత్మిక నగరం కాదు.. భారత రక్షణరంగ భవిష్యత్తు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత మహత్తరమైన రక్షణ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. వికసిత భారత్ 2047 నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ బలమైన భాగస్వామ్యం అందిస్తుంది'.. అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.


Also Read:

నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

Read Latest AP News

Updated Date - May 15 , 2026 | 01:32 PM