Share News

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

ABN , Publish Date - May 15 , 2026 | 11:21 AM

కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్
Byreddy Shabari

కర్నూలు, మే 15: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై స్పందించారు. రౌడీ మూకల గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో నిన్న(గురువారం) జరిగిన వైసీపీ ఆందోళనలో సగం మందికి పైగా గంజాయి బ్యాచ్, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారే పాల్గొన్నారని తెలిపారు. ఎస్వీ మోహన్ రెడ్డి స్క్రాప్ మనుషులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. బాలు అనే వ్యక్తి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నాడని తెలిపారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే వైసీపీ నాయకులు ఇలాంటి వారి కోసం ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.


ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై ఏవేవో మాట్లాడుతున్నారని బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించడం తప్పా అని ప్రశ్నించారు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారని వైసీపీ నేత అంటున్నారని.. జగన్ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్‌పై నిఘా పెడతామని స్పష్టం చేశారు. ముచ్చుమర్రిలో మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపిన వాళ్లు వైసీపీ కార్యకర్తలే అంటూ ఆరోపించారు. బాలికను చంపిన వారిని వైసీపీ నేతలు పరామర్శించి.. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను శవ రాజకీయం చేయలేదన్నారు. బాలిక శవం కోసం 5 రోజులు గాలించామని.. అప్పుడు వైసీపీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కాదు...రాక్షసులంటూ విరుచుకుపడ్డారు.


రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా.. తాను సిద్ధం అంటూ ఎంపీ సవాల్ విసిరారు. ‘అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు తీసి బెదిరిస్తుంటే పోలీసులు స్పందించడం తప్పా. పోలీసులను లాక్కొచ్చి పనిష్మెంట్ ఇస్తారట.. పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు. టీడీపీ ఎవరినీ వదలదు.. మేము తప్పుచేసినా యాక్షన్ తీసుకుంటారు. భూకబ్జాలు చేశారంటున్న వాళ్లు ఆధారాలతో ఎందుకు ముందుకు రాలేదు’ అని ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

శ్రీభగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2026 | 11:30 AM