హంద్రీ-నీవా పెండింగ్ పనులపై ప్రభుత్వ దృష్టి
ABN , Publish Date - May 13 , 2026 | 12:34 PM
హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణా జల ప్రవాహం ఆగిపోవడంతో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వచ్చే సీజన్‌కల్లా ప్రధానకాలువ పూర్తికి చర్యలు
శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్లకు నీళ్లు...
తర్వాతే చంద్రగిరి, కళ్యాణి డ్యామ్‌లకు సరఫరా
రూ.1,140కోట్ల అంచనాతో ప్రతిపాదనలు
మదనపల్లె(చిత్తూరు): హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణా జల ప్రవాహం ఆగిపోవడంతో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురం, మదనపల్లె సర్కిల్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రధాన కాలువతో పాటు పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్‌లో మిగిలిన లైనింగ్ పనులు, ఇతర కాంక్రీటు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అడవిపల్లె రిజర్వాయర్ నుంచి మొదలై చిత్తూరు జిల్లా అరగొండ వరకూ సాగే నీవా బ్రాంచి కెనాల్, కొత్తగా చేపట్టే తిరుపతి జిల్లా మూలపల్లె నుంచి చంద్రగిరి, అక్కడి నుంచి కళ్యాణి డ్యామ్‌కు ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఇందుకు మొత్తం రూ.1,140 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. వీటికి ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర పడగానే పనులు ప్రారంభం కానున్నాయి.
పుంగనూరు బ్రాంచి కెనాల్ మొదలయ్యే కదిరి సమీపంలోని చెర్లోపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి వరకూ ఎనిమిది కిలోమీటర్ల లైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో 75 కాంక్రీటు నిర్మాణాలు(స్ట్రక్చరు) ఉన్నాయి. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే కుప్పం బ్రాంచి కెనాల్‌లోనూ లైనింగ్ పెండింగ్ పనులు, ఇతర నిర్మాణాలకు రూ.70కోట్లతో అంచనాలు రూపొందించారు. మరోవైపు హంద్రీ-నీవా ప్రధాన కాలువలో రెండోవైపున ఇంతవరకూ నీటి ప్రవాహం మొదలు కాలేదు. ఫలితంగా రాయచోటి సమీపంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్, కె.వి.పల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్లు పూర్తయినా కొన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా అనంతపురం హంద్రీ-నీవా సర్కిల్‌లోని 90 కి.మీ., మదనపల్లె సర్కిల్‌లో 70 కి.మీ. మేర ప్రధాన కాలువ అక్కడక్కడ మట్టి పనులు, ఇతర కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే సీజన్ నాటికి ఈ పనులు పూర్తి చేసి రెండు రిజర్వాయర్లకు అక్కడి నుంచి నీవా బ్రాంచి కెనాల్‌ను పూర్తి చేసి చిత్తూరుకు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రధాన కాలువ రెండు ప్యాకేజీలు, అడవిపల్లె నుంచి ప్రారంభమయ్యే నీవా బ్రాంచీ కెనాల్‌ను 120 కి.మీ.ను మూడు ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఈ అయిదు ప్యాకేజీలను పూర్తి చేయడానికి రెండు విధానాల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
ఇందులో పెండింగ్ పనులతో పాటు లైనింగ్ పూర్తి చేయడానికి రూ.925 కోట్లు, లైనింగ్ కాకుండా ప్రస్తుతానికి నీటినే తీసుకెళ్లడానికి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.350 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు పంపారు. అయితే లైనింగ్ పనులు పక్కన పెట్టి వచ్చే సీజన్‌కు ఆ రెండు రిజర్వాయర్లకు ఎట్టి పరిస్థితిలోనూ కృష్ణా జలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో ప్రతిపాదనకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అనంతపురం సర్కిల్‌లోని 90 కి.మీ.ప్రధాన కాలువలో పెండింగ్ పనులుకు సుమారు రూ.500కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.అడవిపల్లె రిజర్వాయర్ నుంచి 120కి.మీ.
దూరంలోని చిత్తూరుకు నీవా బ్రాంచీ కెనాల్‌కు సమాంతరంగా ఇప్పటికే పైపులైన్ పనులు పూర్తి చేశారు. ఇక అడవిపల్లె రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు రాగానే నీవా బ్రాంచితో పాటు పైపులైన్ ద్వారా చిత్తూరుకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. అలాగే నీవా బ్రాంచి కెనాల్ ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలోని మూలపల్లెకు నీటిని తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం రూ.120 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలోని చెరువులు నింపుతూ, తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యామ్‌కు నీటిని నింపేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ పనులను మైనర్ ఇరిగేషన్ అధికారులు చేపడుతున్నారు.
అనంతపురం, మదనపల్లె హంద్రీ-నీవా సర్కిల్‌లోని 160 కి.మీ. ప్రధాన కాలువ వెంబడి అక్కడక్కడా 20 కి.మీ.పైగా మట్టిపనులు, పుంగనూరు బ్రాంచి కెనాల్‌లో ఎనిమిది కి.మీ., పుంగనూరు బ్రాంచి కెనాల్‌లో ఆరు కి.మీ. అసంపూర్తిగా ఉన్న లైనింగ్ పనులు పూర్తి చేయనున్నారు. అలాగే నీవా బ్రాంచి కెనాల్‌లోనూ 20 కి.మీ.పైగా మట్టిపనులున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక నీవా బ్రాంచీ కెనాల్ ముగిసే అరగొండ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని మూలపల్లె పథకం, అక్కడి నుంచి కళ్యాణి డ్యామ్ వరకూ కొత్తగా పనులు చేపడుతున్నారు. ఇది సీఎం సొంత నియోజకవర్గం కావడంతో హంద్రీ-నీవా బ్రాంచి కెనాల్‌ను పొడిగించినట్లు చెబుతున్నారు. వచ్చే సీజన్ నాటికి రెండు రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వాలని, తర్వాత 2027-28 నాటికి చంద్రగిరి(మూలపల్లె పథకం) అక్కడి నుంచి తిరుపతి నియోజకవర్గంలోని కళ్యాణి డ్యామ్‌కు కృష్ణా నీటిని తీసుకెళ్లేలా ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాణాలు ఇవి..
లైనింగ్‌లో షాట్ క్రీటింగ్, ప్రధాన కాలువ, బ్రాంచి కెనాల్లో సర్ఫేజ్ వాటర్ వెళ్లడానికి ఎస్కే్‌పలు(వివిధ కారణాలతో కాలువ నిండితే నీరు బయటకు వెళ్లడానికి వీలుగా), కాలువపై బ్రిడ్జిలు, కొండలు, గుట్టల పైప్రాంతం నుంచి కాలువలోకి వచ్చే నీటిని పంపేలా (ఇన్‌లెట్) నిర్మాణం, యూటీ(అండర్ టన్నెల్), ఎస్‌పీ(సూపర్ ప్యాసేజ్), అక్విడెట్(వాగుపైన కాలువ పోయే మార్గం), కాలువల వెంబడి చెరువులు, కుంటలకు నీళ్లు పంపడానికి వీలుగా తూములు(గేటు విధానం), తదితర కాంక్రీటు నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ స్పెషల్ ఫోకస్
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు: అనిత
Read Latest AP News And Telangana News And International News And Telugu News