బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
ABN , Publish Date - May 13 , 2026 | 11:51 AM
తమిళనాడు అసెంబ్లీలో నేడు జరిగిన బలపరీక్షలో సీఎం విజయ్ నెగ్గారు. మొత్తం 144 మంది సభ్యులు సీఎంకు మద్దతు తెలిపారు. 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన బలపరీక్షలో 144 మంది ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. ఈ సందర్భంగా మూజువాణి ఓటుకు బదులుగా స్పీకర్ సభలో ఒక్కో సభ్యుడి మద్దతు గురించి అడిగి తెలుసుకుని వారి ఓటును నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎమ్ఎల్ పార్టీల ఎమ్మెల్యేలు టీవీకేకు అనుకూలంగా ఓటు వేశారు. అన్నాడీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలూ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఇక డీఎంకే ఈ విశ్వాసపరీక్షను బహిష్కరించింది. పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో, సభలో సభ్యుల సంఖ్య తగ్గి మ్యాజిక్ మార్కులో కూడా ఆ మేరకు కోత పడింది. ఈ క్రమంలో బలపరీక్షలో సీఎం విజయ్ సులువుగా నెగ్గారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రజలను నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగామని గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందని అన్నారు. తమను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక టీవీకేకు మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్యెల్యేల తరపున సీనియర్ నేత వేలుమణి మాట్లాడుతూ తాము ఎలాంటి మంత్రి పదవులనూ ఆశించట్లేదని అన్నారు. ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టాల్సిన అవసరం తమకు లేదని సీఎం విజయ్ ఈ సందర్భంగా బదులిచ్చారు.
మరోవైపు, ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తిరస్కరించారని అన్నారు. విశ్వాసపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే మద్దతును కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకూ డీఎంకే అమలు చేసిన పథకాలను కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు.