CM Revanth Reddy on Medaram: పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 23 , 2025 | 02:50 PM
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ములుగు, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి (Medaram Development) ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) మేడారంలో సమ్మక్క - సారక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
సమ్మక్క - సారలమ్మ స్ఫూర్తి..
ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు అధికారులు. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆలయాన్ని విస్తరణ, అభివృద్ధిని ముక్తకంఠంతో ఏకీభవించారు పూజారులు, ఆదివాసీ సంఘాలు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటానని గుర్తుచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఎలాంటి లోటు పాట్లు రాకుండా నిర్మాణం..
మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు. శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు. సంప్రదాయంలో ఎలాంటి లోటు పాట్లు రాకుండా ఉండాలనేదే తమ అభిమతమని ఉద్ఘాటించారు. మేడారంపై నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వందరోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
భక్తితో పనిచేయాలి..
రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా సమ్మక్క - సారలమ్మ ఆలయం ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ఆదాయం ఆశించి కాదని… భక్తితో పనిచేయాలని సూచించారు. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆ బాధ్యత ఆదివాసీలపై ఉంది..
జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగు నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైన చోట చెక్ డ్యామ్‌లు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే వందరోజులు సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల మాలధారణ చేసినట్లుగా నిష్టతో పనిచేయాలని సూచించారు. మేడారం ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పనులు పూర్తి చేయించుకునే బాధ్యత ఆదివాసీలపై ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest Telangana News And Telugu News