CM Revanth Reddy on Medaram: మేడారం జాతరకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 23 , 2025 | 03:08 PM
ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ములుగు, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతర (Medaram Jatara)కు కేంద్రప్రభుత్వం (Central GOVT Funds) ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలోచించాలని కోరారు. అయోధ్య, కుంభమేళాకే కాదని... మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒప్పించి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడారం మహా జాతరకు మళ్లీ వస్తానని… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు కేంద్రప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇవాళ(మంగళవారం) మేడారంలో సమ్మక్క - సారక్క అమ్మవార్లను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
మాకు దక్కిన గొప్ప అదృష్టం
భారీ వర్షాలు పడుతుండటంతో మేడారానికి తాను రావడానికి వాతావరణం సహకరించదని అధికారులు చెప్పినా తాను పట్టించుకోలేదని... అంతా సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లు చూసుకుంటారని ఏర్పాట్లు చేయమని ఆదేశించానని పేర్కొన్నారు. మేడారం గద్దెల పునర్నిర్మాణం తమకు జన్మలో దక్కిన గొప్ప అదృష్టమని చెప్పుకొచ్చారు. సమ్మక్క - సారలమ్మ గద్దెల అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుచేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీల సంప్రదాయాలను పరిరక్షిస్తామని ఉద్ఘాటించారు. ఆదివాసీల వారసులు, రీసెర్చ్ చేస్తున్న స్కాలర్స్‌ను మేడారం ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు చేశామని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
రాతికట్టడాలతో నిర్మాణం..
రాళ్లతో నిర్మించినా రామప్పలా వందల ఏళ్లు పటిష్టంగా ఉండేలా మేడారం గద్దెలను రాతికట్టడాలతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మహాజాతర వరకు రేయంబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జంపన్నవాగు, రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే వందరోజుల్లో భక్తితో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారం పునర్నిర్మాణం బాధ్యతతో పాటు భావోద్వేగంతో కూడుకున్నదని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తమ ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాంతమైన మేడారం నుంచి తాను పాదయాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. ఫిబ్రవరి 6, 2023న సమ్మక్క - సారక్క అమ్మవార్ల దగ్గర నుంచి పాదయాత్ర చేసి విజయం సాధించామని ఉద్ఘాటించారు. ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులని చెప్పుకొచ్చారు. అందుకే వారి అభివృద్ధిపై దృష్టి పెట్టామని వెల్లడించారు. అభివృద్ధి పథకాల్లో ఆదివాసీలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు
‘ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నాం. సమ్మక్క - సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లే’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్ని కోట్లయినా మంజూరు చేస్తాం..
‘ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా మా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. అందుకే సమ్మక్క- సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తాం. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలుగకుండా పనులు పూర్తి చేస్తాం. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. స్థానికుల భాగస్వామ్యం, సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది. సమ్మక్క - సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో గద్దెల పనులను నిర్వహించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest Telangana News And Telugu News