Share News

Kishan Reddy: ఈ బిల్లు మీకే కాదు.. అన్ని పార్టీలకు వర్తిస్తది.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:46 AM

ప్రధాని సహా దేశంలో ఏ రాజకీయ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే వారు పదవి నుంచి దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి వ్యతిరేకత వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అందరికీ వర్తిస్తుందని.. కానీ, కాంగ్రెస్ మాత్రమే ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదంటూ చురకలంటించారు.

Kishan Reddy: ఈ బిల్లు మీకే కాదు.. అన్ని పార్టీలకు వర్తిస్తది.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్
Kishan Reddy

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు సహా పదవిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నేత అయిన సరే.. తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల ప్రకారం, ఐదేళ్లకుపైగా శిక్షకు దారి తీసే నేరాలపై అరెస్టై వరుసగా 30 రోజులు జైలులో ఉంటే.. 31వ రోజున ఆయా పదవి నుంచి ఎవరైనా స్వయంగా తప్పుకోవాల్సిందే. రాజీనామా చేయకపోయినప్పటికీ అటువంటి నాయకులు పదవీచ్యుతులవుతారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.


కాంగ్రెస్‌కోసం కాదు.. అందరికీ వర్తిస్తుంది..

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 'రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. అద్వానీ పై ఆరోపణలు వస్తే రాజీనామా చేసి తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు. నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో రివ్యూమీటింగ్ పెట్టాడు. ఆరు నెలలు జైలు నుంచే సీఎంగా పరిపాలన చేసి వ్యవస్థల పరువు తీశాడు. జైలు కు వెళ్లి కూడా తమిళ నాడు మంత్రి సెంథిల్ బాలాజీ పదవిలో కొనసాగాడు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం. దీనిపై మేధావులు,విద్యావంతులు ప్రజలు చర్చించాలి. నైతిక విలువల రాజకీయాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చాం' అని స్పష్టం చేశారు.


గురివింద రాజకీయాలు చేసేవారే వ్యతిరేకిస్తున్నారు..

లోక్ సభలో ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ కూటమి తీరు దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గురివింద రాజకీయాలు చేసే పార్టీలే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. నిజాయితీ పాలన చేస్తే ఎవరూ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అవినీతి అధికారులకు ఏవిధమైన శిక్ష ఉంటుందో అవినీతి రాజకీయ నాయకులకు శిక్ష తప్పదు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా మూడు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఓటమి ఖాయం. ఎన్నికలు వస్తే మూడు రాష్టాల్లో కాంగ్రెస్ భయంకరంగా ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేటీఆర్ మద్దతు ఎవరు అడిగారని ఈ సందర్భంగా అన్నారు.


ఆర్టికల్ 75 (ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల నియామకం), ఆర్టికల్ 164 (సీఎంలు, రాష్ట్ర మంత్రుల నియామకం)లతో అనుసంధానిస్తూ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రతిపాదించారు. అంతేకాదు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్‌కు కూడా ఈ నియమాలు వర్తించేలా యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు – 2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు – 2025లను కూడా ప్రవేశపెట్టారు.


యూరియాపై క్లారిటీ..

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియాపైనా కేంద్రమంత్రి స్పందించారు. తెలంగాణ మంత్రులు ప్రతిరోజూ యూరియా లేదు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. యూరియాను కొందరు నిల్వ చేసుకుంటున్నారు. పెద్దఎతున్న యూరియాను ఇతర వాటికి తరలిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడిగినా.. అడగకపోయినా.. యూరియా ఇస్తాము. పెద్దరైతులు యూరియాను నిల్వచేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2300 సబ్సిడీతో రైతులకు యూరియా ఇస్తోంది. క్రిపోకో నుంచి 17,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రాబోతుంది. చైనా,ఉక్రెయిన్ నుంచి రావాల్సింది కొంత ఆలస్యం అయింది. తమిళనాడు పోర్ట్ నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రానున్నదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు..

శ్రావణ మాసం.. ఆఖరి శుక్రవారం..

For More TG News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 12:56 PM