Share News

Vemireddy Prashanthi Reddy: టీడీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు..

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:36 AM

టీడీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపులు వచ్చాయి. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ ఆమెను బెదిరింపులు అందాయి.

Vemireddy Prashanthi Reddy: టీడీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు..
TDP MLA Vemireddy Prashanthi Reddy

నెల్లూరు, ఆగస్టు 21: టీడీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపులు వచ్చాయి. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు అందాయి. నెల్లూరులోని వేమిరెడ్డి నివాసం వద్ద.. భద్రతా సిబ్బందికి దుండగుడు ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో ఆ లేఖను వేమిరెడ్డి కార్యాలయ సిబ్బంది తెరిచి చూశారు. అందులో ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగడంతో.. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే ఇంటి వద్ద, ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్లాక్‌ మెయిలర్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసానికి వచ్చాడు.. ఈ లేఖ అందజేసిన అనంతరం అతడు ఎటు వైపు వెళ్లాడు అనే అంశాలను సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


అయితే ఈ విచారణను పోలీసులు గోప్యంగా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిన విషయం వాస్తవమని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెళ్లడిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు.


ఇక ఆగస్టు 17వ తేదీన ఈ బెదిరింపు లేఖను ఎమ్మెల్యే భద్రతా సిబ్బందికి దుండగుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ఇచ్చిన వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని నెల్లూరులోని స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు వచ్చాడు. అక్కడి భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి.. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. మరోవైపు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇసుకపాలెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.


అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరోక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. అతడి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు రావడం.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

శ్రావణ మాసం.. ఆఖరి శుక్రవారం..

AP More AP News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 09:05 AM