Hyderabad: బెంగళూరు నుంచి నగరానికి ఎండీఎంఏ సరఫరా
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:03 AM
బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెప్పించి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్థుడితో పాటు అతడికి సరఫరా చేస్తున్న బెంగళూరుకు చెందిన విద్యార్థిని దోమలగూడ, హెచ్‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.30 లక్షల విలువైన 12.57 గ్రాముల ఎండీఎంఏ, 305 గ్రాముల గంజాయి, ఒక కారు, 3 మొబైల్స్, రూ.1080 స్వాధీనం చేసుకున్నారు.
- పాత నేరస్థుడితో పాటు సరఫరాదారుడు అరెస్ట్
- వివరాలు వెల్లడించిన దోమలగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌న్యూ సీఐ డానియెల్
హైదరాబాద్ సిటీ: బెంగళూరు(Bengaluru) నుంచి ఎండీఎంఏ తెప్పించి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్థుడితో పాటు అతడికి సరఫరా చేస్తున్న బెంగళూరుకు చెందిన విద్యార్థిని దోమలగూడ, హెచ్‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.30 లక్షల విలువైన 12.57 గ్రాముల ఎండీఎంఏ, 305 గ్రాముల గంజాయి, ఒక కారు, 3 మొబైల్స్, రూ.1080 స్వాధీనం చేసుకున్నారు. దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దోమలగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌న్యూ సీఐ డానియేల్ వివరాలు వెల్లడించారు.
మచిలీపట్నంకు చెందిన రాఘవేంద్రరావు డిప్లొమా వరకు చదువుకున్నాడు. స్నేహితుడితో కలిసి మెడికల్ ఏజెన్సీ పెట్టి నష్టపోయాడు. అప్పులు తీర్చుకునేందుకు గంజాయి విక్రయాలు ప్రారంభించాడు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి నూజివీడు ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. గంజాయి దందా చేస్తున్న అతడిని పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో అతడిపై 5 కేసులు నమోదయ్యాయి. విజయవాడ ఆటోనగర్‌లో ఉంటున్న రాఘవేంద్రరావు జైలు నుంచి విడుదలై గంజాయితో పాటు, నగరంలో ఎండీఎంఏ విక్రయాలు ప్రారంభించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బెంగళూరుకు చెందిన నిఖిల్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి, నగరంలో కస్టమర్లకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. బెంగళూరు(Bengaluru)కు చెందిన నిఖిల్ ఏఐలో బీసీఏ చదువుతున్నాడు. స్నేహితులతో గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డ అతడు, నైజీరియన్ల పరిచయంతో పెడ్లర్‌గా మారాడు. నైజీరియన్‌ల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, పలువురికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రాఘవేంద్రకు కూడా ఎండీఎంఏ సరఫరా చేస్తున్నాడు.
తన ఆచూకీ ఇతరులకు తెలియకుండా ఉండేందుకు ఎండీఎంఏ, గంజాయిని ఓ ప్రదేశంలో ఉంచి, ఆన్‌లైన్ చెల్లింపులు అయిన తర్వాత ఈ వివరాలు సరఫరాదారులకు అందించేవాడు. వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న హెచ్‌న్యూ సిబ్బంది, దోమలగూడ పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. ఎండీఎంఏ డెలివరీ చేసేందుకు వచ్చిన నిఖిల్, తీసుకునేందుకు వచ్చిన రాఘవేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో దోమలగూడ ఎస్‌ఐ విజయ, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News