Minister Thummala on Urea Shortage: తెలంగాణ రైతు సంక్షేమం దేశం మొత్తానికి ఆదర్శం: తుమ్మల
ABN , Publish Date - Sep 16 , 2025 | 07:05 PM
భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఢిల్లీ, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): రైతులందరికీ ఉపయోగపడే విధంగా స్కీములన్నిటిని ఒకే గొడుగు కిందకు కేంద్ర ప్రభుత్వం తీసుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala NageswaraRao) సూచించారు. దేశ రైతాంగానికి ఉపయోగపడే పాలసీలను రూపొందించే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఇవాళ(మంగళవారం) నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ - 2025ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, వ్యవసాయ శాఖ నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతును ఏ రకంగా కాపాడాలి, రైతు ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు.
పామాయిల్ సాగులో తెలంగాణ ముందంజ
ఈ సమావేశంలో కొన్ని అంశాలపై ప్రస్తావించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 1960లో చేసిన విత్తన చట్టం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ అంశాన్ని ఎందుకు పున: పరిశీలించలేదని ప్రశ్నించారు. దానివల్ల విత్తన కంపెనీలు దగా, మోసం చేసిన రైతులు నష్టపోయిన ఏ మాత్రం వెసులుబాటు లేదని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని సూచించారు. భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని ఉద్ఘాటించారు. పామాయిల్‌పై విధించిన ఇంపోర్ట్ ట్యాక్స్‌ను పెంచి భారత రైతులకు ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేయాలని ఆకాంక్షించారు. వ్యవసాయానికి సంబంధించి కేంద్రంలో అనేక స్కీంలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఫెర్టిలైజర్స్‌ను రేషనలైజ్ చేయాలి..
తెలంగాణలో చేపట్టిన రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రంలో జరుగని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని వివరించారు. వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ఫెర్టిలైజర్స్‌ను రేషనలైజ్ చేయకపోవడంతో భూసారం పడిపోతుందని తెలిపారు. ఫలితంగా యూరియాను సరిగా సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు. ఇందువల్ల రైతన్నకి యూరియా కొరత వచ్చిందని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి యూరియా దిగుమతులపై కేంద్రప్రభుత్వం ఆధారపడిందని వెల్లడించారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు సైతం పనిచేయలేకపోయాయని అన్నారు. సరైన సమయంలో యూరియా సరఫరా చేయకపోవడంతో దిగుబడి తగ్గుతుందనే అపోహాతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఫెర్టిలైజర్స్‌ను రేషనలైజ్ చేసి రేట్లు తగ్గించాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అనుప్రియ పటేల్‌తో తుమ్మల భేటీ..
అలాగే, యూరియా కొరతపై కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(మంగళవారం) కలిశారు. యూరియా కొరత అంశంలో సహాయం అందిస్తామని అనుప్రియ పటేల్ చెప్పారని అన్నారు. ఈ వారంలో 80,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు ఇచ్చారని, మరో 40,000 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కోరానని చెప్పారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఖరీఫ్‌లో అవసరం ఉందని తెలిపారు. యూరియా ఇస్తే రబీకి కూడా తాము ప్లాన్ చేసుకోగలుగుతామని అన్నారు. రబీలో ఇచ్చిన ప్లాన్ సైతం అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ వారంలో మరో 40 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు
ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
For More TG News And Telugu News