Share News

Khairatabad Ganesh Nimajjan: గంగమ్మ ఒడికి బడా గణేశ్.. హుస్సేన్ సాగర్‌‌లో ఘన నిమజ్జనం..

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:55 PM

ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన మహోత్సవం ఘనంగా ముగిసింది. తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న బడా గణేషునికి జయజయధ్వానాలతో ఘనంగా వీడ్కోలు పలికారు భక్తజనులు.

Khairatabad Ganesh Nimajjan: గంగమ్మ ఒడికి బడా గణేశ్.. హుస్సేన్ సాగర్‌‌లో ఘన నిమజ్జనం..
Khairatabad Ganapathi Immersion Ends Grandly in Hyderabad

ఖైరతాబాద్ మహా గణపతికి నభూతో నభవిష్యతి అనేలా కనివినీ ఎరుగని రీతిలో భక్తజనం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ పాయింట్ 4 దగ్గర బడా గణపతి నిమజ్జనం అనుకున్న సమయానికే ప్రశాంతంగా ముగిసింది. వేలాది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మళ్లీ తిరిగి రావయ్యా వినాయకా.. అంటూ వైభవోపేతంగా సాగనంపారు. నిమజ్జనానికి ముందు ఉత్సవ సమితి సభ్యులు శాస్త్రోక్తంగా తుదిపూజలు నిర్వహించారు.


ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల 71వ సంవత్సరం. కోట్లాది మంది భక్తులను నవరాత్రుల్లో బడా గణేషుని దర్శనం చేసుకుని పరవశించిపోయారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం సరిగ్గా ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర ఆరంభమైంది. వెల్డింగ్ వర్క్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వినాయకుడి రథయాత్ర కన్నులపండువగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ట్యాంక్ బండ్ చేరుకుంది. సుమారు 70 అడుగుల భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ గణపతిని నెమ్మదిగా ఎత్తి, భక్తుల నినాదాల మధ్య హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేర్చారు.


నగరవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు రహదారులపై బారులు తీరారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్, ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. మహగణపతితో పాటు అనేక వినాయక విగ్రహాలు ఒకేసారి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. 'గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా' నినాదాలతో గణపయ్యను కీర్తిస్తూ నినాదాలు చేశారు. 'జై జై గణేశా... బై బై గణేశా' అంటూ ఏకదంతునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అపుర్వ ఘట్టాన్ని వేలాది మంది ప్రజలు స్వయంగా వీక్షించగా.. కోట్లాది మంది టెలివిజన్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయారు. ఇక, ఖైరతాబాద్ శోభాయాత్ర జరిగే మార్గంలో ముందుగానే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ఠమైన భద్రత చర్యలు చేపట్టడంతో బాహుబలి క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ముగిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం

For More Telangana and Latest News

Updated Date - Sep 06 , 2025 | 05:16 PM