Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:19 PM
నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని చోట్ల నిమజ్జన కార్యక్రమం..
హైదరాబాద్, సెప్టెంబర్ 6: నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని చోట్ల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలు మోహరించాయని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో కీలకమైన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ జితేందర్ చెప్పారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైందని.. నాలుగు గంటల్లోపు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ వివరించారు.
వినాయక నిమజ్జనం రేపటి(ఆదివారం) వరకు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. ప్రజలు కూడా త్వరగా నిమజ్జనం పూర్తి చేసేందుకు సహకరించాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అదనంగా ప్రత్యేక ఫోర్స్ విధుల్లో ఉందని తెలిపారాయన. డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్ లోని ఐసీసీసీ లో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈసారి ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిమజ్జనం విధుల్లో పాల్గొందని డీజీపీ తెలిపారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్పీఫ్, ఎస్‌టీఎఫ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని చెప్పారు.
ఇదిలాఉండగా.. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడిని చేరేందుకు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తవడంతో.. నగరంలో మిగతా పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. శోభాయాత్ర సాగే రూట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వినాయక శోభాయాత్రను చూడటానికి భక్త జనం భారీగా తరలి వస్తున్నారు.
బాలాపూర్ గణేషుడు చార్మినార్ వద్దకు చేరుకున్నాడు. చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్‌కు తరలివస్తున్నాడు. బాలాపూర్ గణేషుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో చార్మినార్ వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. మరోవైపు ఎంజే మార్కెట్ వద్ద కూడా భక్తుల రద్దీతో కోలాహలంగా ఉంది. విపరీతమైన రద్దీ ఉండటంతో 500 మంది సిబ్బందితో పోలీసులు ట్రాఫిక్‌ని క్లియర్ చేస్తున్నారు. ప్రసాద పంపిణీల వల్ల రద్దీ పెరిగిపోతోంది. ఇక మహిళలకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు షీ టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు ఆదివారం నాడు చంద్రగ్రహణం ఉండటంతో.. భక్తులు త్వరత్వరగా నిమజ్జనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Also Read:
For More Telangana News and Telugu News..