Mumbai Bomb Threat: ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:27 PM
నిందితుడు అశ్వనీ కుమార్ వృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పాట్నాలోని పాటలిపుత్రలో వాస్తు కన్సల్టెంట్‌గా ఉన్నాడు. గత ఐదేళ్లుగా నొయిడా సెక్టార్ 79లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని తండ్రి సురేష్ కుమార్ పదవీవిరమణ చేసిన విద్యాశాఖ అధికారి.
ముంబై: ముంబై (Mumbai) మహానగరాన్ని మానవబాంబులతో పేల్చేస్తామంటూ వాట్సాప్ మెసేజ్‌లతో కలకలం సృష్టించిన వ్యక్తిని కేవలం 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. అతనిని బిహార్‌కు చెందిన 51 ఏళ్ల అశ్విని కుమార్‌గా గుర్తించారు. సిటీలో 34 'మానవబాంబులు' (Human Bombs) ప్రవేశించినట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన గంటల్లోనే నొయిడాలో అతన్ని అరెస్టు చేశారు.
ముంబై పోలీసులు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ విషయం వెల్లడించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ అరెస్టు చేసినట్టు చెప్పారు. నేరానికి ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముంబై ట్రాఫిక్ వాట్సాప్ హైల్ప్‌లైన్‌కు శుక్రవారంనాడు బాంబు బెదిరింపు వచ్చిందని, దీంతో వదంతులు నమ్మరాదని, ఎలాంటి సహాయం అవసరమైనా తమను నేరుగా సంప్రదించాలని ప్రజలను కోరినట్టు చెప్పారు.
ఏవరీ అశ్విని కుమార్?
నిందితుడు అశ్వనీ కుమార్ వృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పాట్నాలోని పాటలిపుత్రలో వాస్తు కన్సల్టెంట్‌గా ఉన్నాడు. గత ఐదేళ్లుగా నొయిడా సెక్టార్ 79లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని తండ్రి సురేష్ కుమార్ పదవీవిరమణ చేసిన విద్యాశాఖ అధికారి. తల్లి ప్రభావతి హౌస్‌మేకర్. భార్య అర్చనను విడిచిపెట్టేశాడని, ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2023లో అశ్వనీకుమార్‌పై బిహార్‌కు చెందిన అతని ఫ్రెండ్ ఫిరోజ్ ఫుల్వారి పాట్నాలోని షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. దీంతో మూడు నెలల పాటు కుమార్ జైలులో ఉన్నాడు. ఫిరోజ్‌ను టెర్రర్ కేసులో ఇరికించే ఉద్దేశంతోనే కుమార్ తాజాగా బెదిరింపు మెసేజ్‌లు పంపినట్టు ఇన్వెస్టిగేటర్లు చెబుతున్నారు. అరెస్టు సమయంలో కుమార్ నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమరీ కార్డులు, రెండు డిజిటల్ కార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని 196(1)(a)(b), 351(2), 351(3), 351(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
For More National News And Telugu News